ఏసియన్ గేమ్స్ టీ20 క్రికెట్లో రికార్డు బద్దలైంది. ఇప్పటిదాకా సురక్షితంగా ఉన్న స్టార్ బ్యాటర్ యువరాజ్‌సింగ్ రికార్డును నేపాల్ క్రికెటర్ బద్దలు కొట్టాడు. అంతేకాకుండా 9 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి అందరినీ ఆశ్యర్యంలో ముంచెత్తాడు. యువరాజ్ సింగ్ రికార్డును నేపాల్ బ్యాటర్ దీపేంద్రసింగ్ అధిగమించడంతో మరో రికార్డు నెలకొల్పినట్టు అయ్యింది.
– వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ
టీ20 క్రికెట్ అత్యధిక పరుగులు సాధించిన జట్టుగా నేపాల్ మరో కొత్త రికార్డును సృష్టించింది. మంగోలియాపై జరిగిన పోరులో నేపాల్ నిర్ణీత 20 ఓవర్లలో 314 అత్యధిక పరుగులు చేసి కేవలం మూడు వికెట్లను మాత్రమే కోల్పోయింది. ఇందులో కుషాల్ భుర్టెల్ (19), ఆసిఫ్ షేక్ (16), రోహిత్ పౌడెల్ (61) చేసి అవుట్ కాగా కుషాల్ మల్లా 137, దీపేంద్ర సింగ్ 52 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ఇక దీపేంద్ర సింగ్ కేవలం 9 బంతుల్లోనే 52 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. ఇందులో ఎనిమిది సిక్స్లున్నాయి.
కాగా, ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన మంగోలియా జట్టు అత్యంత భారీ టార్గెట్ ముందు చేతులెత్తేసింది. 315 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన జట్టు 13 ఓవర్లు మాత్రమే ఆడి కేవలం 41 పరుగులు చేయగలిగింది. ఇందులో ఓపెనర్లు నరేంబతార్ (1), తెర్బిష్ (0) కాగా, ఒత్కోంబయార్ (3), ఎర్డెన్బుల్గన్ (0), దేవాసురన్ జంయాసురన్ (10) పరుగులు చేశారు.. ఇక మిగతా వారంతా ఒక్క రన్‌కే పెవిలియన్ బాట పట్టారు. దీంతో మంగోలియా జట్టు దారుణంగా ఓటమి చవిచూసింది. ఈ క్రమంలో నేపాల్ జట్టు 273 పరుగుల భారీ ఆధిక్యంతో విజయాన్ని సొంతం చేసుకుంది.