హైదరాబాద్, ఆంధ్రప్రభ : వైద్య వృత్తిలో స్థిరపడాలన్న తెలంగాణ ఇంటర్ బైపీసీ విద్యార్థుల కల ఇకపై సులువుగా సాకారం కానుంది. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ దిశగా ఇప్పటికే ప్రకటించిన ఆరు మెడికల్ కాలేజీలకు ఈ ఏడాది జాతీయ మెడికల్ కమిషన్ అనుమతి లభించింది. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అందుబాటులోకి రానున్న సీట్ల సంఖ్య 6వేలకు చేరింది. నీట్ -2022 పరీక్షా ఫలితాల కోసం వేచి చూస్తున్న రాష్ట్ర విద్యార్థులకు ఎన్ఎంసీ ఆరు మెడికల్ కాలేజీలకు ఇచ్చిన అనుమతి ఎంతో ఊరట కలిగించనుంది. కొత్తగా అనుమతులు లభించిన ఆరు మెడికల్ కాలేజీల్లో ఎంత లేదన్నా 600 నుంచి 900 ఎంబీబీఎస్ సీట్లు కొత్తగా అందుబాటులోకి వచ్చాయి.
కొత్తగూడెం, సిద్ధిపేట, మహబూబాబాద్, నాగర్‌కర్నూలు, వనపర్త్తి, జగిత్యాల జిల్లాల్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు 2022-23 విద్యా సంవత్సరంలో తరగతులు నిర్వహించుకునేందుకు ఎన్ఎంసీ తాజాగా అనుమతులు జారీ చేసింది. రామగుండంతోపాటు మరో రెండు జిల్లాల ప్రభుత్వ మెడికల్ కాలేజీకి కూడా ఈఏడాదిలోనే అనుమతులు రానున్నాయని రాష్ట్ర వైద్య విద్యా విభాగం డైరెక్టర్ డా.రమేష్‌రెడ్డి తెలిపారు. కొత్తగా అనుమతులు వచ్చిన ఆరు మెడికల్ కాలేజీలతోపాటు మరో మూడు మెడికల్ కాలేజీలకు కూడా తరగతుల నిర్వహణకు అనుమతి లభిస్తే రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అందుబాటులోకి రానున్న సీట్ల సంఖ్య 6వేలకు చేరనుందని చెప్పారు.
మరో ఆరు మెడికల్ కాలేజీలకు వచ్చే ఏడాది సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు తోడు రాష్ట్రంలో ఇప్పటికే 17 ప్రయివేటు మెడికల్ కాలేజీల్లో 3200 సీట్లు అందుబాటులో ఉన్నాయి. గత ఏడాది విద్యా సంవత్సరం నాటికి తెలంగాణలో కేవలం ప్రభుత్వ 11 మెడికల్ కాలేజీల్లో 1695 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే అందుబాటులో ఉండేవి. తాజాగా మరో ఆరు మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రావడంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య 19కి చేరింది. కాగా.. 2021-22 ఏడాదిలో అడ్మిషన్లు పూర్తయ్యాక అనుమతులు రద్దు అయిన మూడు ప్రయివేటు మెడికల్ కాలేజీలు టీఆర్ఆర్-పటాన్చెరు, ఎంఎన్ఆర్-సంగారెడ్డి, మహావీర్ మెడికల్ కాలేజీ – వికారాబాద్ కు చెందిన ఎంబీబీఎస్ వైద్య విద్యార్థులకు ఇతర కాలేజీల్లో సీట్ల సర్దుబాటు ప్రక్రియ ఈ నెలాఖరుకు ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు.