బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో మంచి మెజార్టీ సాధించాలి. తెలంగాణలో హ్యాట్రిక్ కొట్టాలని ఏడుకొండల ఎంకన్నను వేడుకున్నారు బీఆర్ఎస్ నేత నీలం మధు ముదిరాజ్. ఇవ్వాల ఆయన తిరుమల శ్రీవారి దర్శనానికి బయలుదేరి వెళ్లే ముందు ‘ఆంధ్రప్రభ’తో మాట్లాడారు. మూడోసారి కేసీఆర్ సారు ముఖ్యమంత్రి కావాలని, ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పటాన్చెరు నుంచి పాదయాత్రగా వస్తానని ఏడుకొండల స్వామికి మొక్కినట్లు నీలం మధు తెలిపారు. దేశ్‌కీ నేతగా కీలకంగా మారాలని, రాష్ట్రంలోనూ ఎదురులేని లీడర్‌గా ఉండాలని కోరుకున్నారు.
– ప్రభన్యూస్ బ్యూరో, ఉమ్మడి మెదక్
బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, పటాన్చెరు కీలక నేత నీలం మధు ముదిరాజ్ ఇవ్వాల (బుధవారం) తిరుమల శ్రీవారి దర్శనానికి బయలుదేరి వెళ్లారు. పటాన్చెరు నియోజకవర్గం నుంచి దాదాపు 30 మంది ఎన్ఎంఆర్ యువసేన సభ్యులతో తిరుపతిలోని అలిపిర నుంచి కాలినడకన ఏడుకొండలు ఎక్కి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలను షేర్ చేసుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోనే కాక దేశంలో కూడా కీలకంగా మారాలని కోరుతూ తిరుమలేశుని వేడుకున్నట్టు నీలం మధు తెలిపారు.
కేసీఆర్ లాంటి విజన్ ఉన్న నాయకుడు, ఉద్యమనేత దేశరాజకీయాలకు ఎంతో అవసరం నీలం మధు అన్నారు. ఆ ఏడుకొండలస్వామి కేసీఆర్ సార్‌ను రాష్ట్రంలో మూడోసారి ముఖ్యమంత్రి చేయడమే కాకుండా దేశరాజకీయాలను శాసించే నేతగా మార్చేలా చూడాలని తాను మొక్కుకున్నట్లు తెలిపారు. దేశంలో అన్ని రాష్ర్టాల నుంచి కూడా నాయకులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారని దీంతో బీఆర్ఎస్ పార్టీ దేశవ్యాప్తంగా బలోపేతం అవుతోందన్నారు.
ప్రస్తుతం పరిస్థితిలో దేశ రాజకీయాలకు కేసీఆర్ వంటినేత ఎంతో అవసరమన్నారు నీలం మధు ముదిరాజ్. భవిష్యత్తులో దేశ రాజకీయాల్లో పెనుమార్పులు సంభవిస్తాయని ఆయన స్పష్టంచేశారు. అనుకున్న విధంగా కేసీఆర్ సార్ భారీ మెజారిటీతో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయగానే తాను పటాన్చెరు నుంచి పాదయాత్రగా తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తానని మొక్కుకున్నట్టు వెల్లడించారు. ఇక.. కేసీఆర్ సార్ వెంటే ఉండి బీఆర్ఎస్ కు ఎనలేని సేవలు అందించే అవకాశం తనకు కల్పించాలని, ఎలాంటి అవకాశం ఉన్నా తాను అందుకు రెడీగా ఉంటానని మధు స్పష్టం చేశారు. ఆ వేంకన్న స్వామి, కేసీఆర్ సార్ కృప తనపై, నియోజకవర్గ ప్రజలపై నిరంతరం ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు చెప్పారు.