న్యూఢిల్లి: నేటి నుంచి పెద్ద ఎత్తున రాజకీయ బల ప్రదర్శనలను యావత్ దేశం వీక్షించనుంది. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో సంఖ్యా బలాన్ని ప్రదర్శించుకోవడానికి ఇటు అధికార ఎన్ డీయే కూటమి అటు విపక్షాలు రంగం సిద్ధం చేసుకున్నాయి. మంగళవారం న్యూఢిల్లి లో దాదాపు 30 పార్టీలతో మెగా సమావేశాన్ని ఎన్‌డీయే ప్రకటించగా, జులై 20 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఐక్యతను చాటే నిమిత్తం 24 విపక్షాలు తమ మధ్య విభేదాలను విస్మరించి సోమ, మంగళవారాల్లో బెంగళూరులో భేటీ కానున్నాయి.
మోడీ, నడ్డా అధ్యక్షతన ఎన్‌డీయే భేటీ
బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్ష తన ఎన్‌డీయే భేటీ కానుంది ఢిల్లిdలోని అశోక్ హోటల్‌లో మంగళవారం సాయంత్రం జరిగే సమావేశానికి భాగస్వా మ్య పక్షాలతో పాటుగా మరికొన్ని పార్టీలను బీజేపీ ఆహ్వానిం చింది. బీహార్‌లో లోక్‌జనశక్తి పార్టీకి చెందిన చిరాగ్ పాశ్వాన్, హిందుస్థాన్ ఆవామీ మోర్చా నేత జితన్ రామ్ మంజి, రాష్ట్రీయ లోక్‌సమతా పార్టీ నేత ఉపేంద్ర సింగ్ కుష్వహ, వికాస్‌శీల్ ఇన్‌సాన్ పార్టీ నేత ముకేష్ సహానిని సమావేశానికి ఆహ్వానించింది. ఈ పార్టీలో ఎన్‌డీయే భాగస్వామ్య పక్షాలుగా అవతరిస్తాయి. సుహేల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ నేత ఓమ్ ప్రకాష్ రాజ్‌భర్ ఎన్‌డీయేలో తిరిగి చేరుతున్నట్టు ఆదివారం ప్రకటించారు. చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ, బాదల్ కుటుంబం నేతృత్వంలోని శిరోమణి అకాలీదళ్ ఎన్‌డీయేలో చేరుతాయనే ఊహాగానాలు మొదట్లో వినిపించినప్పటికీ చివరికి అది కార్యరూపం దాల్చలేదు. ఈ పార్టీలతో బీజేపీ పొత్తు పెట్టుకోదని పార్టీ వర్గాలు తెలిపాయి. పంజాబ్‌లో ఒంటరిగా, ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీతో కలిసి వచ్చే ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తుందని వెల్లడించాయి.
ఎన్‌డీయే కూటమిలో పార్టీలు
ఎన్‌డీయే కూటమిలో పార్టీలు ప్రస్తుతం 24 పార్టీలు ఉన్నాయి. అవి బీజేపీ, అన్నాడీఎంకే, శివసేన(ఏక్‌నాథ్‌షిండే వర్గం), ఎన్‌పీపీ, ఎన్‌డీపీపీ, ఎస్‌కేఎం, జేజేపీ, ఐఎంకేఎంకే, ఏజేఎస్‌యూ, ఆర్పీఐ, ఎంఎన్‌ఎఫ్, టీఎంసీ(తమిళ్ మానిల కాంగ్రెస్), ఐపీఎఫ్‌టీ(త్రిపుర), బీపీపీ, పీఎంకే, ఎంజీపీ, అప్నాదళ్, ఏజీపీ, ఆర్‌ఎల్‌జేపీ, నిషద్ పార్టీ, యూపీపీఎల్, ఏఐఆర్‌ఎన్‌సీ, శిరోమణి అకాలీదళ్ సంయుక్త్(ధింద్‌సా), జనసేన (పవన్ కళ్యాణ్) ఉన్నాయి. ఎన్‌సీపీ(అజిత్ పవార్ వర్గం), లోక్‌జన్‌శక్తి పార్టీ(రామ్‌విలాస్), హెచ్‌ఏఎం, ఆర్‌ఎల్‌ఎస్‌పీ, వీఐపీ, ఎస్‌బీఎస్‌పీ పార్టీలు పాలక కూటమిలో కొత్తగా చేరాయి.