ప్రత్యర్థి రాజకీయ నాయకులను సీబీఐ కేసుల్లో ఇరికించి, ఇబ్బందిపెట్టడంలో దేశాన్ని పదేళ్ల పాటు పరిపాలించిన కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కంటే, 8 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏనే అగ్రస్థానంలో ఉంది. యూపీఏ హయాంలోని 10 సంవత్సరాల్లో సీబీఐ 72 మంది రాజకీయ నాయకులపై కేసులు నమోదు చేసి, దర్యాప్తు నిర్వహించగా, వారిలో 43 మంది అంటే 60శాతం మంది ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలున్నారు. ఇక.. 8 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ -2 హయాంలో సుమారు 124 మందిపై కేసులు నమోదు కాగా, వారిలో 118 మంది అంటే 95 శాతం ప్రతిపక్ష పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు కావడం గమనార్హం.
యూపీఏ హయాంలో బీజేపీ సీబీఐను కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, పంజరంలో చిలుక, జమాయి (అల్లుడు) ఆరోపణలతో పాటు ఇన్‌కంట్యాక్స్ మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌నుట్రినిటీ వంటి పేర్లతో సంబంధించి పార్లమెంటు లోపల, వెలుపలా కాంగ్రెస్ పార్టీని తీవ్రస్థాయిలో విమర్శించిన బీజేపీ, అధికార మార్పిడి తర్వాత కాంగ్రెస్‌ను మించి ప్రత్యర్థి పార్టీల నేతలను సీబీఐకు టార్గెట్‌గా మార్చింది. అయితే, ఇండియాలో గత 18 సంవత్సరాలుగా ప్రభుత్వాలు మారిన వెంటనే, ఇటువంటి ప్రతీకార రాజకీయ ధోరణులు పెచ్చరిల్లడం, ప్రత్యర్థి నేతలపై కేసులు నమోదు చేయడం వంటి దుష్పరిణామాలు కొనసాగుతున్నాయి.
ఎన్డీఏ హయాంలో ఇప్పటి వరకు జాతీయస్థాయిలో కీలకమైన 200 మంది రాజకీయ నేతలపై సీబీఐ కేసులు నమోదు చేయడం, ప్రశ్నించడం, అరెస్ట్‌లు, దాడులు, సోదాలు నిర్వహించింది.
వారిలో సుమారు 80శాతం మంది నేతలు ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులే కావడం గమనార్హం. ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేస్తూ రాజకీయ లబ్ది కోసం వారిపై సీబీఐ కేసులు, ఈడీ దాడుల వంటి ట్రెండ్ 2014లో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత ఎక్కువైంది. కోర్టు రికార్డులు, అధికారిక డాక్యుమెంట్లు, ఏజెన్సీ స్టేట్‌మెంట్లు, నివేదికలను పరిశీలించిన మీదట ఈ వాస్తవం వెల్లడయింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో పది సంవత్సరాలు (2004 నుంచి 2014) పాటు అధికారంలో ఉంది.
ఈ పదేళ్లలో కనీసం యూపీఏ హయాంలో కేసులు నమోదైన 72 మంది రాజకీయ నాయకులు, ఎన్డీఏ హయాంలో కేసులు ఎదుర్కొంటున్న 124 మంది నేతల గురించి సీబీఐను మీడియా ప్రశ్నించగా, అది కేవలం కాకతాళీయంగా జరిగింది తప్ప ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేయలేదని స్పష్టం చేసింది. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు 2జీ స్పెక్ట్రమ్ కేసు, కామన్‌వెల్త్ గేమ్స్, బొగ్గు గనుల కేటాయింపుల కేసువంటి పలు కీలక కేసుల్లో సీబీఐ 72 మంది కీలక రాజకీయ నాయకులను 2004 నుంచి 2014 వరకు విచారించింది. ఈ 72 మందిలో కాంగ్రెస్ లేదా దాని డీఎంకె వంటి మిత్రపక్ష పార్టీలకు చెందిన 29 మందిని సీబీఐ విచారించింది.
అదే ఎన్డీఏ -2 హయాంలో కేవలం ఆరుగురు బీజేపీ నేతలు మాత్రమే సీబీఐ కేసులు ఎదుర్కొంటున్నారు.
యూపీఏ హయాంలో 43 మంది ప్రతిపక్ష పార్టీల నేతలను సీబీఐ విచారించింది. వారిలో బీజేపీకి చెందిన నేతల సంఖ్య ఎక్కువగా ఉంది. 12 మంది బీజేపీ నేతలను సీబీఐ ప్రశ్నించింది, సోదాలు నిర్వహించడం లేదా అరెస్ట్ చేయడం చేసింది. ఆ నేతల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌సా కూడా ఉన్నారు. యూపీఏ హయాంలో అమిత్‌షా గుజరాత్ మంత్రిగా ఉన్నారు. సోహ్రబుద్దీన్ షేక్ ఎన్‌కౌంటర్ కేసులో మంత్రి అమిత్‌షాను సీబీఐ అరెస్ట్ చేసింది.
కర్ణాటక మాజీ ముక్యమంత్రి బి.ఎస్ యడ్యూరప్ప, మాజీ మంత్రి గాలి జనార్థనరెడ్డి మాజీ కేంద్ర రక్షణ శాఖ మంత్రి జార్జ్ ఫెర్నాండజ్, 2జీ స్పెక్ట్రమ్ కేసులో మరణించిన తర్వాత కూడా ప్రమోద్ మహాజన్ పాత్రపై సీబీఐ విచారించి, చార్జ్‌షీట్‌లో 2012లో ఆయన పేరు నమోదు చేసింది. యూపీఏ 2004 -2014 హయాంలో కాంగ్రెస్ మరియు మిత్రపక్షాలకు చెందిన అశోక్ చవాన్ సహా 29, అమిత్‌షా సహా బీజేపీకి చెందిన 12 మంది ప్రముఖులు , మాయావతి బీఎస్సీ 5, మదన్ మిత్ర తృణమూల్ కాంగ్రెస్ 4, ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్‌లు సహా ఎస్పీ 3,, బీజేడీ 2 దిలీప్ రే, ఐఎన్‌ఎల్‌డి 3 ఓంప్రకాష్ చౌతాలా, పీఎంకె అన్భుమణి రాందాస్ 1, ఎల్‌జేపీ రామ్ విలాస్ పాశ్వాన్, ఏఐఏడీఎంకె 1, బీఎస్‌ఆర్ కాంగ్రెస్ 1, జేడీ(యు)3, నలుగురు ఇండిపెండెట్లపై సీబీఐ దర్యాప్తు నిర్వహించింది.
ఎన్డీఏ హయాంలో 2014 నుంచి ఇప్పటి వరకు సీబీఐ 118 మంది కీలక ప్రతిపక్ష రాజకీయ నాయకులపై విచారణ చేపట్టించింది. ఆ జాబితాలో 30తో తృణమూల్ కాంగ్రెస్ టాప్ ప్లేసులో ఉంది. ఆ తర్వాత రెండో స్థానంలో కాంగ్రెస్ 26 ఉంది, కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలకమైన పార్టీ ఆలిండియా ప్రెసిడెంట్ సోనియాగాంధీ, మాజీ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాథ్, పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ (ప్రస్తుతం బీజేపీలో చేరారు) తదితర్లు ఉన్నారు.
తృణమూల్ కాంగ్రెస్‌లో శారదా చిట్‌ఫండ్ కేసు, నారదా స్టింగ్ ఆపరేషన్ కేసుల్లో, పలువురు ముఖ్యనేతలపై సీబీఐ దర్యాప్తు చేపట్టించింది. టీఎంసీ మంత్రి పార్థ చటర్జీని ఎడ్యుకేషన్ స్కాంలో అరెస్ట్ చేసింది. టీఎంసీ, కాంగ్రెస్ తర్వాత ఎన్డీఏ హయాంలో ఆర్జేడీ 10, బీజేడీ10 మంది నేతలపై కేసులు నమోదు చేసింది. ఈ రెండు పార్టీలు బీహార్, ఒడిషాల్లో అధికారంలో ఉన్నాయి.
ఎన్డీఏ హయాంలో
ప్రతిపక్ష పార్టీల వారీగా తీసుకుంటే, టీఎంసీ 20, కాంగ్రెస్ 26, ఆర్జేడీ 10, బీజేడీ 10, వైఎస్సార్‌సీపీ 6, బీఎస్పీ 5, టీడీపీ 5, ఆప్ 4, ఎస్పీ 4, ఏఐఏడీఎంకె 4, సీపీఎం 4, ఎన్సీపీ 3, ఎన్సీ 2, డీఎంకె 2, పీడీపీ1, టీఆర్‌ఎస్ 1, ఇండిపెండెంట్ 1 లపై కేసులు నమోదయ్యాయి.
యూపీఏ హయాంలో
బీజేపీ 12, బీఎస్పీ 5, టీఎంసీ 4, ఇండిపెండెంట్లు 4, ఎస్పీ 3, ఐఎన్‌ఎల్‌డీ 3, జేడీ(యు) 3, బీజేడీ 2, ఎల్జేపీ 1, ఆర్‌ఎల్‌డీ 1, ఎంఎన్‌ఎఫ్ 1, వైఎస్సార్‌సీపీ 1, ఏఐఏడీఎంకె 1, పీఎంకె 1, బీఎస్‌ఆర్ కాంగ్రెస్ 1.