తనకు అందిన నోటీసులని ప్రేమ లేఖలు అని అభివర్ణించారు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్. మహారాష్ట్ర కొత్త సీఎంగా ఏక్ నాథ్ షిండే, డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కు ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు వచ్చాయి. 2004, 2009, 2014, 2020 ఎన్నికల సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్లకు సంబంధించి తనకు ఈ నోటీసులు అందాయని శరద్ పవార్ ట్వీట్ చేశారు. ఈ నోటీసులను ఆయన ప్రేమలేఖలుగా అభివర్ణించారు నేను 2004, 2009, 2014, 2020 సంవత్సరాల్లో దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్లకు సంబంధించి ఆదాయపు పన్ను నుండి నాకు ప్రేమలేఖలు అందాయి అని పవార్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.
బీజేపీ పాలిత కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడిన ఆయన తన మరో ట్వీట్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED), సెంట్రల్ ఏజెన్సీలను కొంత మంది సమాచారాన్ని సేకరించేందుకు ఉపయోగిస్తున్నారు. దాని ఫలితాలు కనిపిస్తున్నాయని అన్నారు. ఇలాగే తమకు కూడా విచారణ కోసం నోటీసులు అందాయని పలువురు శాసన సభ్యులు చెప్పారని తెలిపారు. ఈ విభాగాల సామర్థ్యంలో గుణాత్మక పెరుగుదల ఉంది. చాలా సంవత్సరాలుగా నిర్దిష్ట వ్యక్తుల నుండి సమాచారాన్ని సేకరించడంపై దృష్టి పెట్టడం ఒక వ్యూహాత్మక మార్పుగా కనిపిస్తోందని ఆయన మరాఠీలో ట్వీట్ చేశారు. ఏక్ నాథ్ షిండే ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పదవిని స్వీకరించిన తర్వాత బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ సంతోషంగా కనిపించడం లేదని శరద్ పవార్ అన్నారు. ఫడ్నవిస్ రెండో స్థానాన్ని సంతోషంగా అంగీకరించలేదని నేను భావిస్తున్నాను. అతని ముఖకవళికలు అన్నీ చెప్పాయి అని అన్నారు.