పంజాబ్ రైతుల హృదయాల్లో ప్రధాని నరేంద్ర మోడీపై ఆగ్రహం నెలకొందని ఎన్సీపీ అధినేత, సీనియర్ రాజకీయవేత్త శరద్ పవార్ అన్నారు. పంజాబ్ ఎలక్షన్ లో బిజెపి ఓటమిపై ఆయన స్పందించారు. మోడీపై కోపం ఈ ఎన్నికల్లో స్పష్టంగా ప్రతిఫలించిందని అభిప్రాయపడ్డారు. అందుకే పంజాబ్ ప్రజలు బీజేపీని ఓడించారన్నారు. పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ సొంత పార్టీ పెట్టి బీజేపీతో జట్టు కట్టడం కూడా పంజాబ్ ప్రజలకు నచ్చలేదని శరద్ పవార్ అన్నారు. పంజాబ్ లో ఆప్ 90కి పైగా స్థానాలు చేజిక్కించుకునే దిశగా పరుగులు తీస్తుండగా, బీజేపీ కూటమి 2 స్థానాలతో సరిపెట్టుకుంది. ఈ నేపథ్యంలో, మహారాష్ట్రలో తమ పరిస్థితి ఏంటో తెలుసుకోవడానికి బీజేపీ మరో రెండున్నరేళ్లు ఆగాల్సి ఉంటుందని అన్నారు. ఉత్తరప్రదేశ్ లో సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభంజనం ముందు అఖిలేశ్ యాదవ్ ప్రభావం కనిపించకపోవడంపైనా పవార్ స్పందించారు. అందులో అఖిలేశ్ తప్పేమీలేదన్నారు. సమాజ్ వాదీ పార్టీ సొంతంగానే పోటీ చేసిందని, ఎన్నికల ఫలితాల గురించి అఖిలేశ్ పట్టించుకోవాల్సిన అవసరంలేదని అన్నారు. అఖిలేశ్ జాతీయస్థాయి నేత అని తెలిపారు. గతంలో కంటే మిన్నగా పోరాడాడని కొనియాడారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..