రాష్ట్రంలో ఆక్సిజన్ నిల్వలు, ఉత్పత్తి, సరఫరా పై తూర్పు నావికాదళం ఈఎన్సీ, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సీఎండీతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, బోధనాసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లు నిర్వహణను తూర్పు నావికాదళం చేపట్టనుంది. ఆక్సిజన్ ప్లాంట్లు లీకేజీలు, స్ధితిగతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు నిర్వహణ బాధ్యతలు తీసుకునేందుకు ముందుకొచ్చింది. దీనికోసం అత్యవసరంగా నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఒక్కో బృందం మూడు నుంచి నాలుగు జిల్లాల్లో నిర్వహణా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఎక్కడ అవసరమైతే అక్కడకి ఈ బృందాలను వాయుమార్గంలో తరలించడానికి ఏర్పాటు చేశారు. ఆక్సిజన్ సరఫరాలో అంతరాయాలు, ఇతర ఇబ్బందులను నావికాదళ బృందాలు పరిష్కరించనున్నాయి. ఆక్సిజన్ ప్లాంట్లలో తలెత్తిన సాంకేతిక లోపాలను కూడా సవరించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన సాయం చేసేందుకు నావికాదళం ఆంగీకరించింది. సింగపూర్, థాయ్ లాండ్, మలేషియాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రానున్న ఆక్సిజన్ తో కూడిన 25 క్రయోజనిక్ కంటైనర్స్ ను తరలించేందుకు నావికాదళం అంగీకారం తెలిపింది.
రెగ్యులర్ అవసరాల కోసం లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ కంటైనర్స్ను తరలించేందుకు ప్రత్యేకంగా వాహనాలు సమకూర్చేందుకు నేవీ అధికారులు ఆమోదం తెలిపారు. దీంతో పాటు ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్, డి–టైప్ ఆక్సిజన్ సిలిండర్లతో పాటు కోవిడ్ చికిత్సకు అవసరమైన ఇతర వైద్య పరికరాల సరఫరాకు నేవీ అధికారులు అంగీకారం తెలిపారు. ఐఎన్ఎస్ కళింగ ఆసుపత్రిలో 10 ఆక్సిజన్ బెడ్స్ తో పాటు 60 పడకలును కోవిడ్ చికిత్స కోసం కేటాయించేందుకు తూర్పు నావికాదళం అధికారులు అంగీకరించారు. అదనంగా విశాఖపట్నం జిల్లా కంచరపాలెంలో 150 పడకల తాత్కాలిక ఆసుపత్రి కోసం మౌలిక సదుపాయాల ఏర్పాటుకు నిర్ణయించారు. ఇందుకు అవసరమైన వైద్యులు, పారామెడికల్ స్టాప్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 200 డి–టైప్ సిలిండర్ల అందించేందుకు నేవీ ముందుకొచ్చింది.