చైనా దేశానికి నాటో నేతలు వార్నింగ్ ఇచ్చారు. అనైతిక రీతిలో చైనా తన సైనిక విస్తరణ కొనసాగిస్తున్నదని, ఆ దేశ సైన్యం నుంచి ముప్పు ఉన్న నేపథ్యంలో డ్రాగన్ దేశానికి నాటో నేతలు వార్నింగ్ ఇచ్చారు. బ్రస్సెల్స్‌లో జరిగిన నాటో భేటీలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో పాటు ఇతర నేతలు పాల్గొన్నారు. అత్యంత వేగంగా చైనా తన అణ్వాయుధ శక్తిని పెంచుకుంటోందని నాటో నేతలు ఆరోపించారు. చైనా ప్రవర్తన వ్యూహాత్మక సవాల్‌గా మారినట్లు వారు పేర్కొన్నారు. రష్యాతో సైనిక అంశాల్లో డ్రాగన్ దేశం సహకరిస్తున్నట్లు ఆరోపించారు. సైనిక సత్తాలో.. సాంకేతిక అంశాల్లో నాటోకు సమానంగా చైనా నిలుస్తున్నట్లు నాటో చీఫ్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ తెలిపారు. కానీ కమ్యూనిస్టు దేశంతో ప్రచ్ఛన్న యుద్ధానికి వెళ్లడం లేదని ఆయన అన్నారు.
నాటో దళం అత్యంత శక్తివంతమైంది. దాంట్లో 30 యురోపియన్ దేశాలతో పాటు ఉత్తర అమెరికా దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత కమ్యూనిస్టు రాజ్యాల విస్తరణను అడ్డుకునేందుకు నాటో దళాన్ని ఏర్పాటు చేశారు. 72 ఏళ్ల నాటో కూటమికి మద్దతు ఇస్తున్నట్లు ఇటీవల బైడెన్ స్పష్టం చేశారు. చైనా పారదర్శకంగా వ్యవహరించడం లేదని, ఎటువంటి డేటాను ఇవ్వడం లేదని నాటో చీఫ్ ఆరోపించారు. చైనా తమకు శత్రువు కాదు అని, కానీ ఆ దేశం వ్యవహరిస్తున్న తీరు తమ రక్షణకు సవాల్‌గా మారిందని అన్నారు.