దేశంలోని దిగ్గజ ఐటీ సంస్థలు అనేకం తమ ఉద్యోగులను ఆఫీసుకు రావాలంటూ అల్టిమేటం జారీ చేశాయి. ఇప్పటి వరకు ఇంటి నుంచి చేసింది చాలు… ఇక మీదట వారానికి అయిదు రోజులు ఆఫీసుకు రావాల్సందేనని ఐటీ దిగ్గజ కంపెనీల నుంచి మిడ్ సంస్థల వరకు తమ ఉద్యోగులకు ఈ మెయిల్ ద్వారా మెస్సేజ్ చేరవేశాయి. ఈ ఆదేశాలపై ఉద్యోగుల్లో విముఖత వ్యక్తం అవుతున్నా.. లేఆఫ్ భయాలు వెంటాడుతుండటంతో కంపెనీ ఆదేశాలు పాటించేందుకే మొగ్గు చూపుతున్నారు.
సృజనాత్మకత పెంచేందుకు చర్యలు..
ఉత్పాదక, సృజనాత్మకత పెంచేందుకు ఆఫీసుల్లోంచే పనిచేయాలని కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో, సొంతూళ్లకు వెళ్లిపోయిన ఐటీ ఉద్యోగులు తమ కుటుంబాలతో సహా నగరాల బాట పడుతున్నారు. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో ఇళ్ల అద్దెలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే పలు చిన్న కంపెనీలు తమ ఉద్యోగులను పూర్తిస్థాయిలో కార్యాలయాలకు రప్పిస్తున్నాయి. ఉద్యోగుల రాకతో నగరాలలో ట్రాఫిక్ తిరిగి పెరిగిపోతున్నది..
హైబ్రీడ్ మోడ్‌లో పెద్ద కంపెనీలు..
పెద్ద కంపెనీల్లోనే హైబ్రీడ్ మోడల్ కొనసాగుతోంది. అయితే.. ఆఫీసులకు వచ్చేందుకు ఉద్యోగులు ఇంకా విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లోంచి పనిచేసినా ఉత్పాదకత తగ్గని విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. నగరాల్లో కార్యాలయాలకు రాకపోకలు సాగించేందుకు సగటున 2 నుంచి 3 గంటల సమయం పడుతుండటం అనేక మందిని కలవరానికి గురి చేస్తోంది.
ఉద్యోగులకు తప్పని పరిస్థితులు..
కరోనా కాలంలో పనికి ఆటంకాలు ఎదురు కాకుండా అనేక కంపెనీలు వర్క్ ఫ్రం హోం వెసులుబాటు కల్పించాయి. ఇక కొవిడ్ తగ్గుముఖం పట్టడంతో కొన్ని సంస్థలు హైబ్రీడ్ మోడల్‌కు తెరలేపాయి. వారానికి కనీసం మూడు రోజులన్నా ఆఫీసులకు రావాలని స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు, అమెరికా, ఐరోపా వ్యవస్థలు మందగమనంలో ఉన్న నేపథ్యంలో దేశీ సంస్థలు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగులందరినీ ఆఫీసులకు రప్పించేందుకు మొగ్గు చూపుతున్నాయి. ఉద్యోగులకు సైతం సంస్థ నిర్ణయానికి తలవంచక తప్పడం లేదు. స్తుతం నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే ఐటీ రంగంలో వర్క్ ఫ్రం హోం శకం ముగిసినట్టేనని పరిశీలకులు అంటున్నారు. కంపెనీలు, ఉద్యోగుల్లో వస్తున్న మార్పులే ఇందుకు నిదర్శనంగా చూపెడుతున్నారు.