Monday, November 25, 2024

అప్ప‌ర్ భ‌ద్ర‌కు జాతీయ హోదా.. మ‌రి పాల‌మూరు సంగ‌తేంది? కేంద్రానికి కేటీఆర్ ప్ర‌శ్న‌

తెలంగాణ ప్రాజెక్టుల‌కు జాతీయ హోదా ఇవ్వ‌ని కేంద్ర ప్ర‌భుత్వంపై తెలంగాణ ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ మండిప‌డ్డారు. క‌ర్నాట‌క‌లోని అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారు.. తెలంగాణ‌లోని పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు ఎందుకు అన్యాయం చేశారు. మ‌రి ఈ ప్రాజెక్టు సంగ‌తేంది? అని కేటీఆర్ కేంద్రాన్ని ప్ర‌శ్నించారు.

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా జ‌డ్చ‌ర్ల మండ‌లం కోడుగ‌ల్‌లో మంత్రి కేటీఆర్ ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా రైతు వేదిక‌ను, 40 డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌ను మంత్రులు కేటీఆర్, నిరంజ‌న్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌, ఎమ్మెల్యే ల‌క్ష్మారెడ్డి క‌లిసి ప్రారంభించారు. అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన స‌భ‌లో మంత్రి కేటీఆర్ ప్ర‌సంగించారు. తెలంగాణ ప‌ల్లెల్లో అద్భుత‌మైన అభివృద్ధి జ‌రుగుతుంద‌న్నారు మంత్రి కేటీఆర్‌. ఆస‌రా పెన్ష‌న్లు ఇచ్చి వృద్ధుల‌ను, వితంతువుల‌ను, వికలాంగుల‌ను ఆదుకుంటున్నాం. నాణ్య‌మైన 24 గంట‌ల విద్యుత్‌తో రైతులు సంతోషంగా ఉన్నారు. ఆడ‌బిడ్డ‌ల పెళ్లిళ్ల‌కు క‌ల్యాణ‌ల‌క్ష్మి, షాదీ ముబార‌క్ ప‌థ‌కం కింద ఆర్థిక సాయాన్ని అందిస్తున్నామ‌ని కేటీఆర్ తెలిపారు.

హైదరాబాద్ – బెంగళూరు జాతీయ రహదారి వెంట పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేసి.. వెనకబడిన పాలమూరు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సాయపడాలని కేంద్రాన్ని కోరామ‌ని తెలిపారు. కేంద్రం మాత్రం దీనికి స్పందించ‌డం లేదు. స‌మైక్య రాష్ట్రంలో చిన్న డ‌బ్బా ఇల్లు మంజూరు చేశారు. కానీ, తెలంగాణ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత నిరుపేద‌లు ఆత్మ‌గౌర‌వంతో బ‌త‌కాల‌నే ఉద్దేశంతో డ‌బుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నామ‌ని పేర్కొన్నారు. కేంద్రం కలసి వచ్చినా, రాక పోయినా.. మీ ఆశీర్వాదంతో సీఎం కేసీఆర్ ప్రభుత్వం వెనకడుగు వేయలేదు.. వేయదు అని కేటీఆర్ తేల్చిచెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement