మలేరియా కేసులను తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషికి జాతీయ స్థాయి గుర్తింపు దక్కిందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. గత ఆరేళ్లలో (2015-2021) రాష్ట్రంలో మలేరియా కేసులు గణనీయంగా తగ్గాయని కేంద్ర కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది. తెలంగాణ ప్రభుత్వం ఆరేళ్లలో మలేరియాను నియంత్రించి, కేసులను గణనీయంగా తగ్గించి కేటగిరీ-2 నుంచి కేటగిరీ-1లోకి చేరిందని పేర్కొంది. ఇందుకు ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ఈ నెల 25వ తేదీన ఢిల్లీలో జరుగనున్న ప్రత్యేక కార్యక్రమంలో సత్కరించనున్నది. కార్యక్రమానికి రావాల్సిందిగా శుక్రవారం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర వైద్యారోగ్య శాఖకు ఆహ్వానం పంపింది. ఈ సందర్భంగా ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు.
దోమలను నియంత్రించి, ప్రజలను వ్యాధుల బారి నుంచి రక్షించేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ చేపట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి వల్లే ఇది సాధ్యమైందన్నారు. ఏటా వర్షాకాలం ప్రారంభంలో గ్రామాలు, పట్టణాల్లో అన్ని రకాల వ్యర్థాల కుప్పలు తొలిగించడం, కూలిపోయే స్థితిలో ఉన్న ఇండ్లను కూల్చి వేయడం, డ్రైడే వంటి కార్యక్రమాల ఫలితంగా దోమల సంఖ్య పెరుగకుండా నియంత్రించామని చెప్పారు. తద్వారా మలేరియా కేసులు తగ్గాయని వెల్లడించారు. ఈ కృషిని కేంద్రం గుర్తించి, ప్రశంసించడం హర్షనీయమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మలేరియాను నియంత్రించేందుకు నేషనల్ ఫ్రేమ్ వర్క్ ఫర్ మలేరియా ఎలిమినేషన్ (ఎన్ఎఫ్ఎంఈ) కార్యక్రమాన్ని 2016లో ప్రారంభించింది. అప్పటి నుంచి ఆరేళ్లలో దేశంలో మలేరియా కేసులను 86.5శాతం, మరణాలను 76 శాతం తగ్గించినట్టు కేంద్రం తెలిపింది.