Tuesday, November 26, 2024

Spl Story: నేషనల్​ హెరాల్డ్​ కేసు.. కాంగ్రెస్​ లీడర్లకు సంబంధమేంటి? స్కామ్ నిజమేనా!

అది హెరాల్డ్ హౌస్.. ఢిల్లీలోని “ఫ్లీట్ స్ట్రీట్”- బహదుర్షా జాఫర్ మార్గ్ లోని మట్టికొట్టుకుపోయిన ఓ వైట్​ బిల్డింగ్​. ఢిల్లీ నడిబొడ్డున ITO నుంచి కూతవేటు దూరంలోనే ఉంటుంది ఈ భవనం​. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL)తో  ఏర్పాటైన భారీ ఆస్తులలో ఇది కూడా ఒకటి. దీని షేర్లు, ఆస్తులన్నీ తర్వాత యంగ్ ఇండియన్ (YI)కి బదిలీ అయ్యాయి. ప్రస్తుతం హెరాల్డ్ హౌస్  0.3 ఎకరాలు, ఐదు అంతస్తుల భవనం. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ నియంత్రణలో ఉన్న ఆస్తులలో ఇదొకటి. దాని రెండో అంతస్తులో పాస్‌పోర్ట్ సేవా కేంద్రం ఉంది.

అంతేకాకుండా ఒక ఫోటోకాపియర్ దుకాణం గ్రౌండ్ ఫ్లోర్‌లో  ఉంది. అదే సమయంలో భవనం వెలుపల ఉన్న డిజిటల్ నోటీసు బోర్డు, పోస్టర్‌లో మాత్రం AJL ద్వారా వారపత్రిక ప్రచురితమవుతున్నట్టు ఉంది. కానీ, సెక్యూరిటీ గార్డు మాత్రం తనకు ఈ భవనంలోని ఏ ఆఫీసు గురించి తెలియదని చెబుతున్నాడు. కాగా, నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రిక వెబ్‌సైట్ మాత్రం డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫామ్​లో పనిచేస్తోంది. ఢిల్లీ నడిబొడ్డున విలువైన అస్సెట్​గా ఉన్న ఈ భారీ భవనంపై ప్రస్తుతం స్టే ఆర్డర్ కొనసాగుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం..‌‌
– నాగరాజు చంద్రగిరి, ఆంధ్రప్రభ

============

National Herald: జవహర్​లాల్​ నెహ్రూ స్థాపించిన నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికలో స్కామ్ జరిగిందా? ఈ స్కామ్లో సోనియా, రాహుల్ గాంధీ పాత్ర ఉందా? యంగ్ ఇండియా ఎలా వచ్చింది? అసలు ఈ నేషనల్ హెరాల్డ్ కేసు ఏమిటి? అనే ప్రశ్నలు చాలామంది నుంచి ఎదురవుతున్నాయి. ఈ తరం యూత్​కి అసలు నేషనల్​ హెరాల్డ్​ గురించి తెలియదు. దీంతో గాంధీ ఫ్యామిలీకి, దీనికి లింకేమిటి, కాంగ్రెస్​ లీడర్​ రాహుల్​ని ఈడీ ఎందుకు హర్రాస్​ చేస్తోందనే ప్రశ్నలకు సమాధానాలు తరిచి చూస్తే..

దేశంలో ఇప్పుడు చర్చ అంతా నేషనల్​ హెరాల్డ్ కేసు గురించే  జరుగుతోంది. కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీని ఈడీ దాదాపు మూడు రోజులు విచారించడం ఈ కేసు తీవ్రతను స్పష్టం చేస్తోంది. త్వరలో.. కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉంది. 

- Advertisement -

నేషనల్ హెరాల్డ్ అంటే ఏంటి?

బ్రిటీష్​ రాజ్యంపై యుద్ధం కోసం 1938లో స్థాపించిన వార్తాపత్రికే ఈ నేషనల్​ హెరాల్డ్​. నాటి కాంగ్రెస్​ అధ్యక్షుడు జవహర్​లాల్​ నెహ్రూ ఈ పత్రికను ప్రారంభించారు. ఏజేఎల్​(అసోసియేటెడ్​ జర్నల్స్​ లిమిటెడ్​) అనే సంస్థ నేషనల్​ హెరాల్డ్​ పత్రికలను ప్రచురించేది.నేషనల్​ హెరాల్డ్​ వార్తాపత్రికలో 5వేల మంది స్వాతంత్ర్య సమరయోధులు షేరు హోల్డర్లుగా ఉండేవారు. స్వాతంత్ర్యం తర్వాత.. ఈ నేషనల్​ హెరాల్డ్​ను కాంగ్రెస్​ అన్ని విధాలుగా ఉపయోగించుకున్నదనే వార్తలున్నాయి. అనంతరం.. ఉర్దూ(కౌమి అవాజ్​), హిందీ(నవ్​జీవన్​)లోనూ నేషనల్​ హెరాల్డ్​ ఎదిగింది.

దేశానికి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం నేషనల్​ హెరాల్డ్ చైర్మన్​ పదవి నుంచి నెహ్రూ తప్పుకున్నారు. దాంతో క్రమంగా.. దేశంలో నేషనల్​ హెరాల్డ్​ ఉనికి కోల్పోతూ వచ్చింది. చివరికి 2008లో ఈ వార్తాపత్రిక మూతపడింది. అప్పటికే ఆ సంస్థకు రూ. 90.25కోట్ల అప్పులున్నాయి. అయితే.. అప్పులను తొలగించేందుకు  కాంగ్రెస్​ పార్టీ నేషనల్​ హెరాల్డ్​కు రూ. 90.25కోట్లు ఇచ్చింది. అది కూడా రుణ రహిత అప్పుగా ఇచ్చింది.

మరి యంగ్ ఇండియా లిమిటెడ్ ఏంటి?

2009లో యూపీఏ మరోమారు అధికారంలోకి వచ్చింది. 2010లో యంగ్​ ఇండియా పేరుతో దేశంలో ఓ ఎన్​జీఓ సంస్థ ఆవిర్భవించింది. ఈ యంగ్​ ఇండియాకు కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ డైరక్టర్​గా ఉండేవారు. ఆయనతో పాటు కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఇతర నేతలు మోతీలాల్​ వోరా, ఆస్కర్​ ఫెర్నాండేజ్ షేర్​హోల్డర్ బాధ్యతలు తీసుకున్నారు.

2010లో ఏజేఎల్​కు 1,057మంది షేర్​హోల్డర్లు ఉండేవారు. 2011లో ఒక్కసారిగ  ఏజేఎల్​కు చెందిన అన్ని హోల్డింగ్స్​ను యంగ్​ ఇండియాకు బదిలీ చేసేశారు. దీంతో ఏజేఎల్ సంస్థ యంగ్​ ఇండియాలో చేరింది. దానికున్న రూ. 90,25కోట్ల రుణం బదులు.. రూ. 50లక్షలను యంగ్​ ఇండియాకు చెల్లించింది. ఫలితంగా దేశవ్యాప్తంగా ఉన్న నేషనల్​ హెరాల్డ్​ ఆస్తులన్నీ యంగ్​ ఇండియా వశమయ్యాయి.

సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్​తో వెలుగులోకి నేషనల్​ హెరాల్డ్​ స్కామ్!

నేషనల్​ హెరాల్డ్​ వ్యవహారంపై 2012లో ఢిల్లీ ట్రయల్​ కోర్టులో పిటిషన్​ వేశారు న్యాయవాది సుబ్రహ్మణ్య స్వామి. ఆ తర్వాత ఆయన 2013లో బీజేపీలో చేరారు. నేషనల్​ హెరాల్డ్​ విషయంలో పెద్ద స్కామ్​ జరిగిందని, దీంతో సోనియా గాంధీ, రాహుల్​ గాంధీకి సంబంధం ఉందని సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు.

ఆరోపణలు ఏంటంటే..

యంగ్​ ఇండియా షేర్​ క్యాపిటల్​ రూ. 5లక్షలుగా ఉండేది. కానీ, కోల్​కతాకు చెందిన షెల్​ కంపెనీ డోటెక్స్​ మెర్చెండైజ్​ నుంచి రూ. 1కోటి అప్పు తీసుకుంది. అందులో నుంచి రూ. 50లక్షలు తీసి కాంగ్రెస్​కు ఇచ్చింది. ఆ తర్వాత  ఏజేఎల్​ను యంగ్​ ఇండియా తన సొంతం చేసుకుంది. ఢిల్లీలోని కీలక రియల్​ ఎస్టేట్​ ఆస్తుల సహా మరిన్ని నగరాల్లోని నేషనల్​ హెరాల్డ్​ అస్తులు యంగ్​ ఇండియా చేతికి వెళ్లాయి. వీటి విలువ రూ. 2వేల కోట్లు పైమాటే! కొంత కాలం తర్వాత  నేషనల్​ హెరాల్డ్​కు ఇచ్చిన రూ. 90.25కోట్ల అప్పును కాంగ్రెస్​ మాఫీ చేసింది. అప్పటికే కాంగ్రెస్​ చేతిలో యంగ్​ ఇండియా ఇచ్చిన రూ. 50లక్షలు ఉన్నాయి.

ఎలాంటి వాణిజ్యపరమైన కార్యకలాపాలు లేని యంగ్​ ఇండియాకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా రూ. 800కోట్లు ఆస్తులున్నాయి. అప్పుల రూపంలో కాంగ్రెస్​కు రూ. 90.25కోట్లు రావాల్సి ఉండగా.. కేవలం రూ. 50లక్షలే తీసుకుంది. కాంగ్రెస్​ ఇచ్చిన రూ. 90.25కోట్లు అప్పులు కూడా అక్రమమే అని సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు. పార్టీ ఫండ్​లో నుంచి డబ్బులు తీసి నేషనల్​ హెరాల్డ్​కు ఇచ్చినట్టు చెప్పారు. ఇది ఐటీ చట్టాలకు వ్యతిరేకమని పిటిషన్​లో పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ వాదన..

ఈ పూర్తి వ్యవహారంలో తాము ఎలాంటి తప్పు చేయలేదని కాంగ్రెస్​ చెబుతోంది. రుణాలు తీసుకోకుండా అప్పులు ఇవ్వడంతో రూ. 90.25కోట్లు న్యాయపరమైనదేనని అంటోంది. ఏజేఎల్​.. కాంగ్రెస్​కు చెందినదేనని, ఆ సంస్థను ఆదుకోవడం తమ పార్టీ బాధ్యతని స్పష్టం చేసింది. యంగ్​ ఇండియాను చారిటీ కోసం ఏర్పాటు చేసినట్టు, లాభాల కోసం కాదని తేల్చిచెప్పింది.

మనీ లాండరింగ్​ జరిగిందా?

నేషనల్​ హెరాల్డ్​ వ్యవహారంలో మనీలాండరింగ్​, స్కామ్​ జరిగాయా? అన్నది కోర్టులు తేల్చుతాయి. కానీ.. ఈలోపు కాంగ్రెస్​ పార్టీ ప్రతిష్ఠ మరింత దెబ్బతినే అవకాశం ఉందని పొలిటికల్​ అనలిస్టులు అంటున్నారు. కాంగ్రెస్​ ఓ అవినీతి పార్టీ అని బీజేపీ ముద్రవేసి.. ప్రజల్లోకి వెళ్లడానికి ఇట్లా ప్లాన్​ చేసిందని గుర్తుచేస్తున్నారు.

ఈ సమయంలో నేషనల్​ హెరాల్డ్​ వ్యవహారంతో కాంగ్రెస్​కు తలనొప్పి తప్పదని అంటున్నారు. కొన్నేళ్లుగా కాంగ్రెస్​ పార్టీ డీలా పడిపోయింది. ఎన్నికల్లో వరుస ఓటములను చవిచూస్తోంది. పార్టీ పునరుద్ధరణ కోసం ఈమధ్యనే భారీ ప్రణాళికలు రచించింది. వాటిని అమలు చేసేందుకు సిద్ధపడుతోంది. కాగా, తాజా పరిణామాల మధ్యే నేషనల్​ హెరాల్డ్​ కేసు మళ్లీ తెరపైకి రావడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement