రైతే దేశానికి వెన్నుముక. అన్నదాత లేనిదే మనిషి లేడు. రైతు అహర్నిశలు కష్టపడితే తప్ప మనం తినే కంచంలోకి అన్నం రాదు. అతివృష్టి,అనావృష్టి అనునిత్యం వెంటాడుతూనే ఉన్నా.. రైతు మాత్రం తన కష్టాన్ని వీడడు. రైతు ఆరుగాలం శ్రమించి పంటి పండించినా అది చేతికి అందుతుందనే నమ్మకం లేదు. అయినా సరే రైతులు మాత్రం కుంగిపోకుండా ఈ ఏడు కాకపోతే వచ్చే ఏడాది ప్రకృతి కరుణించకపోతుందా, పంట చేతికందకపోతుందా అనే ఆశావాదంతో జీవనం సాగిస్తున్నారు. నేడు(డిసెంబర్ 23) జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు.
భారత మాజీ ప్రధాని చౌదరీ చరణ్ సింగ్ జయంతిని జాతీయ రైతు దినోత్సవంగా జరుపుతారు. దేశ ప్రధానిగా చరణ్ సింగ్ పనిచేసింది కొద్ది కాలమే అయినా… వ్యవసాయ రంగానికి విశేష కృషి చేశారు. రైతుల మేలు కోసం ఆయన ఎన్నో వ్యవసాయ చట్టాలను అమల్లోకి తెచ్చారు. అన్నదాతలను ఆదుకునే ఎన్నో పథకాలు అమలు చేశారు. చరణ్ సింగ్ రైతు బంధుగా పేరుతెచ్చుకున్నారు. చరణ్ సింగ్ సేవలకు గుర్తుగా ప్రభుత్వం ఆయన జన్మదినోత్సవం సందర్భంగా జాతీయ రైతు దినోత్సవంగా ప్రకటించింది. చరణ్ సింగ్ సమాధిని కిసాన్ ఘాట్ అని పిలుస్తారు. డిసెంబరు 23న ఆయన జయంతిని ‘జాతీయ రైతు దినోత్సవం’గా నిర్వహిస్తున్నారు. 2001 నుంచి ఈ ఆనవాయితీ వస్తోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital