Wednesday, November 20, 2024

జాతికి గ‌ర్వ‌కార‌ణం – విశ్వ‌మాన‌వుడు అంబేద్క‌ర్

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్‌ విగ్రహం తెలంగాణకే మణిహారంగా, మరో మకుటాయమానంగా విలసిల్లేం దుకు సర్వం సిద్ధమైంది. ఎడమ చేతిలో రాజ్యాంగంతో, కుడిచేతిని ముందుకు చాచి, తన చూపుడు వ్రేలితో గొప్ప ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తున్న బాబాసాహెబ్‌ అంబేద్కరుడి విగ్రహం దేశానికే వన్నె తేనున్నది. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, డా. బిఆర్‌ అంబేద్కర్‌ మహాశయుడికి తెలంగాణ సర్కార్‌ మరింత ఖ్యాతితో వన్నె తెచ్చేలా నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ 132వ జయంతి సందర్భంగా దేశంలోనే అతిపెద్ద లోహ విగ్రహావిష్కరణ శుక్రవారంనాడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా ఆవిష్కృతం కానుంది. ఈ మహోన్నత ఘట్టానికి ప్రత్యేక అతిథిగా అంబేద్కర్‌ మనుమడు ప్రకాష్‌ అంబేద్కర్‌ హాజరవుతున్నారు.


125 అడుగుల ఎత్తులో నిర్మించిన డా. బిఆర్‌ అంబేద్కర్‌ మహా విగ్రహాన్ని, శోభాయమానంగా.. తెలంగాణ సమాజంతో పాటు యావత్‌ దేశ ప్రజలు సంబురపడేలా గొప్పగా ఆవిష్కరించుకుందా మని సీఎం కేసీఆర్‌ గతంలోనే పిలుపునిచ్చారు. దేశం గర్వించదగ్గ స్థాయిలో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటున్న సందర్భంలో ఆవిష్క రణ సభ కూడా అంతే ఉన్నత స్థాయిలో, అంబేద్కర్‌ ఔన్నత్యాన్ని మరింత గొప్పగా ప్రపంచానికి చాటి చెప్పేలా ప్రభుత్వం గొప్పగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా విగ్రహ రూపశిల్పి.. 98 ఏండ్ల పద్మభూషణ్‌, రామ్‌ వంజీ సుతార్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించి ఘనంగా సత్కరించనున్నారు.
ఈ విగ్రహ ప్రకటన 2016లో సీఎం కేసీఆర్‌ చేయగా, ఎన్టీఆర్‌ పార్కు పక్కన 11.4 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఏడాదిలోనే పూర్తి చేయాలని భావించినా ఆరేళ్లకుపైగా సమయం పట్టింది. రూ.146 కోట్లతో ప్రాజెక్టు ప్రారంభమవగా, 2016 ఏప్రిల్‌ 14న శంకుస్థాపన చేశారు. భూమి నుంచి 175 అడుగుల ఎత్తుతో 2ఎకరాల విస్తీర్ణంలో విగ్రహ నిర్మాణం పూర్తయింది. ఇందుకు 791 టన్నుల స్టీల్‌, ఇత్తడి 96 మెట్రిక్‌ టన్నులు వినియోగించారు. 425 మంది కార్మికులు అనునిత్యం శ్రమించి నిర్మాణ ప్రక్రియలో పాల్గొన్నారు.

అన్నీ ప్రత్యేకతలే…
అత్యంత రాజసంగా నిర్మితమైన అంబేద్కర్‌ కాంస్య విగ్రహానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ విగ్రహం ఎత్తు 125 అడుగులు కాగా, దీనిని నిలబెట్టడానికి నిర్మించిన బేస్‌ 50 అడుగుల ఎత్తుతో ఉన్నది. ఈ బేస్‌ను పార్లమెంట్‌ నమూనాలో నిర్మించారు. ఇందుకు పార్లమెంట్‌ చట్టం, రాజ్యాంగం రూపొందించిన మహనీయుడు కాబట్టే అందుకు గుర్తుగా ఈ బేస్‌ను ఆ తరహాలో నిర్మించారు. భూకంపాలు వచ్చినా తట్టుకుని నిలిచేలా, గాలి ఒత్తిడికి తట్టుకునేలా, వర్షాలు, ఎండలు తట్టుకుని ఠీవీగా రాజసంతో నిల్చేలా తీర్చిదిద్దారు. ఈ విగ్రహం తయారీకి కాంస్యం, 155 టన్నుల స్టీల్‌, 111 టన్నుల కాంస్యం వినియోగించారు. విగ్రహం అడుగు భాగంలో పార్లమెంట్‌ను పోలిన భవనాన్ని నిర్మించారు. కిందిభాగంలో ఫొటో గ్యాలరీ ఏర్పాటు చేసేందుకు వీలుగా ఏర్పాట్లుంటాయి. ఇందులో ఆయన జీవిత చరిత్ర, గొప్పతనం తెలిపే ప్రదర్శనలు ఉంటాయి. తెలంగాణ ఏర్పాటుకు అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగమే ప్రధానం కావడంతో ఆయనను స్మరించుకునేలా ఈ విగ్రహం రూపుదాల్చుకుంటోంది.

అంబేద్కర్‌ విగ్రహంతోపాటు మొమోరియల్‌ పార్కును ఏర్పాటు చేస్తున్నారు. మ్యూజియం, గ్రంథాలయం వేలాదిమంది సందర్శిం చేలా అత్యాధునిక వసతులను కల్పిస్తున్నారు. భారీ విగ్రహం కోసం చైనాలో అధ్యయనం చేసిన ప్రభుత్వం ఈ భారీ నిర్మాణానికి సకల చర్యలు తీసుకున్నది. ఈ విగ్రహాన్ని సెక్రటేరియట్‌, అమరుల స్మృతి చిహ్నం సమీపాన నెక్లెస్‌ రోడ్‌లో నిర్మించడం వెనుక ప్రభుత్వ ఉదాత్త లక్ష్యం ఉన్నది. భావితరాల ప్రజలు, యువతకు అంబేద్కర్‌ విగ్రహాన్ని వీక్షించినపుడు మా ఆలోచనలు కూడా ఆయనలా ఉన్నతంగా ఉండాలని, బడుగు, బలహీన వర్గాల కోసం పాటుపడాలనే తపన నెలకొనాలన్నదే సర్కార్‌ అభిమతంగా ఉంది.
భారీ ఏర్పాట్లు…
రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా అంబేద్కర్‌ అభిమానులు, సామాజిక వేత్తలు, సామాన్యులు విగ్రహ సందర్శన కోసం భారీగా తరలిరానున్న నేపథ్యంలో నివాళి అర్పించేందుకు విగ్రహ ప్రాంగణంలో పలు రకాల పుష్పాలను అందుబాటులో ఉంచనున్నారు. ఎండల తీవ్రత నేపథ్యంలో నీడ కోసం టెంట్లు, తాగునీరు, మజ్జిగ తదితర ఏర్పాట్లు చేస్తున్నారు. డా.బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహావిష్కరణను అత్యంత వైభవోపేతంగా, చారిత్రాత్మక వేడుకగా, కన్నుల పండుగగా దేశం గర్వించే రీతిలో జరపాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ సందర్భంగా ప్రత్యేక హలికాప్టర్‌ ద్వారా పూల జల్లు కురిపిస్తూ ఘనమైన రీతిలో పుష్పాంజలి ఘటించనున్నారు. గులాబీలు, తెల్ల చామంతి, తమలపాకులతో అల్లిన భారీ పూలమాలను విగ్రహానికి అలంకరిస్తారు. 125 అడుగుల డా. బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి ఉన్న భారీ పరదాను తొలగించడానికి, నిలువెత్తు పూలమాలను అలంకరించడానికి పెద్ద క్రేన్‌ను వాడనున్నారు. ఈ కార్యక్రమానికి బౌద్ధ భిక్షువులను మాత్రమే ఆహ్వానించి, బౌద్ధ సంప్రదాయ పద్దతిలోనే కార్యక్రమాన్ని నిర్వహస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement