– నాగరాజు చంద్రగిరి, ఆంధ్రప్రభ
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ- నాసా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆర్టిమిస్–1 ప్రాజెక్టుకు అవరోధాలు ఎదురవుతున్నాయి. ఆర్టిమిస్-1 పేరుతో చేపట్టిన మిషన్ ఇప్పటికే సాంకేతిక కారణాలతో రెండు సార్లు వాయిదా పడింది. ఆ తర్వాత సెప్టెంబరు 23న మరోసారి ప్రయోగించాలని అనుకున్నా.. సాంకేతిక కారణాలతో ప్రాజెక్టు ముందుకు సాగలేదు. కానీ, అన్ని పనులు పూర్తి చేసుకుని, అవరోధాలను అధిగమించి సెప్టెంబర్ 27న నింగిలోకి దూసుకెళ్లేందుకు ఆర్టిమిస్ 1 రెడీగా ఉందని ఇవ్వాల నాసా వెల్లడించింది.
కాగా, అంతరిక్ష ప్రయోగాల్లో అమెరికా అంత అనుభవం లేని భారత్ చందమామపై అడుగుపెట్టాలని ఇంతకుముందు ప్రయత్నించింది. చంద్రయాన్-2 పేరుతో ఇండియా చేపట్టిన మిషన్ చివరి క్షణంలో ఫెయిల్ అయ్యింది. చంద్రుడి కక్షలో నుంచి ఉపరితంపై విక్రమ్ ల్యాండర్ ల్యాండింగ్ అవుతున్న సమయలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో విక్రమ్‌తో ఇస్రో టెక్నికల్ సెంటర్‌కు సంబంధాలు తెగిపోయాయి. అంటే.. దాదాపు చంద్రుడిపైకి భారత్ వెళ్లినట్టే.. కానీ, అంతరిక్షంపై, చంద్రుడిపై పరిశోధనల్లో అపార అనుభవం ఉన్న అమెరికా మాత్రం జాబిలి కక్షలోకి వెళ్లేందుకే ఇబ్బందులు పడుతోంది.
దీంతో అసలు అప్పట్లో నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ బృందం చందమామపై అడుగు పెట్టిందా? లేదా? అన్న అనుమానాలు ఇప్పుడు చాలామంది నుంచి వినిపిస్తున్నా. అప్పట్లో అదంతా సెట్టింగ్ చేసి చూపించారని సోవియట్ రష్యా విమర్శలు గుప్పించింది. ఇప్పుడు నాసా అవస్థ చూస్తుంటే అదంతా నిజమేనా? అన్న డౌట్స్ కూడా విమర్శకుల నుంచి వినిపిస్తున్నాయి.
ఇక.. నాసా అంటే.. ప్రపంచంలోనే టాప్ బ్రాండ్. నాసాకు చెందిన టీషర్ట్స్ కానీ, మగ్స్, బంపర్ స్టిక్కర్స్ కు ఫుల్ డిమాండ్ ఉంటుంది. నాసాను మార్కెట్ చేసినంతగా అమెరికా మరే ఏజెన్సీని చేయలేదు. 20వ శతాబ్దంలో అంతరిక్ష పరిశోధనల్లో నాసా కింగ్‌గా నిలిచిందనే చెప్పవచ్చు. నాసా పేరుతో హాలీవుడ్‌లో ఏలియన్లకు సంబంధించిన సినిమాలు నిర్మితమై ఎన్నో రికార్డులు సృష్టించాయి. అయితే.. ఇప్పుడు అదే నాసా చందమామపై పరిశోధనలకు చేపట్టిన ఆర్టిమిస్-1 మిషన్‌లో భాగంగా.. చంద్రుడి కక్షలోకి ఒక రాకెట్‌ను పంపలేక ఎన్నో ఒడిదుడుకులకు లోనవుతున్నది.
చంద్రుడిపై మనిషిని పంపేందుకు తాజాగా ఆర్టిమిస్‌ను మూడు భాగాలుగా విభజించింది నాసా. ఆర్టిమిస్-1లో భాగంగా చంద్రుడి కక్షలో మానవరహితంగా పంపాలని నిర్ణయించింది. అది కాస్తా ఢమాల్ అన్నది. 2024లో మనిషిని పంపాలని, 2025లో చంద్రుడిపై అడుగు పెట్టాలని నాసా ప్రణాళికలు రచించింది. తొలిసారి మహిళలను చంద్రుడిపైకి పంపాలని కూడా భావించింది. ఇదంతా ఇప్పుడు వినడానికి ఎంతో బాగున్నా 1960ల్లోనే నాసా వ్యోమగాములు చంద్రుడిపై అడుగు పెట్టారు. అలాంటిది ఇప్పుడు కొత్తగా మళ్లీ అక్కడికి మనిషిని పంపడానికి ఇన్ని ప్రయత్నాలు ఏమిటనే ప్రశ్నలు సామాన్యుల నుంచి కూడా వినిపిస్తున్నాయి.
నాసా ఆర్టిమిస్ మిషన్‌ను చేపట్టడానికి రెండు కారణాలున్నాయని తెలుస్తోంది. ఒకటి నాసాలో ఉద్యోగాన్ని కాపాడుకోవడం.. అంటే నేరుగా నాసాలో 17వేల మంది పని చేస్తున్నారు. కాంట్రాక్టర్లతో కలుపుకుంటే పరోక్షంగా లక్ష మంది దాకా ఉంటారు. కొన్ని వందల కంపెనీలు ఇందులో కొలాబరేట్ అయి ఉన్నాయి. ఇక, రెండో కారణం.. గొప్పల కోసం ఈ ప్రాజెక్టును నాసా చెపడుతోందని కొంతమంది నుంచి వినిపిస్తున్న మాట. ప్రపంచ దేశాల్లోనే పెద్దన్నగా, సూపర్ పవర్‌గా ఎదిగిన అమెరికా ఇప్పుడు టెక్నాలజీలో చైనాతో పోటీ పడలేకపోతోంది. చైనాతో పోలిస్తే ఈ ప్రాజెక్టుకు కచ్చితమైన లక్ష్యమంటూ ఏదీ లేదని నిపుణులు చెబుతున్నారు.