Friday, November 22, 2024

కార్పొరేట్ క‌ళాశాల‌ల‌పై ఇంట‌ర్ బోర్డు ఉక్కుపాదం… నార్సింగ్ చైత‌న్య అనుమ‌తి ర‌ద్దు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని కార్పొరేట్‌ జూనియర్‌ కళాశాలల్లో చోటుచేసుకుంటున్న వరుస ఆత్మహత్యలు, యాజ మాన్యాలు, అధ్యాపకుల వేధింపులపై చర్చించేందుకు నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మొహం చాటేయడంపై ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి. స్వతహాగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నా నని మూడు రోజుల నుంచి సామాజిక మాధ్యమాల్లో ప్రచా రం చేసిన మంత్రి తీరా సమావేశానికి గైర్హాజరవడంపై విద్యార్థి, అధ్యాపక సంఘాలతోపాటు, వివిధ రాజకీయ పార్టీల నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ముందస్తుగా చేసుకున్న ఒప్పందంలోని భాగంగానే మంత్రి ఈ సమావే శానికి దూరంగా ఉన్నారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తు న్నాయి. కీలకమైన ఈ సమావేశానికి రాకుండా రంగారెడ్డి జిల్లా పరిషత్‌ సమావే శానికి వెళ్లడంపై ఉపాధ్యాయ సంఘాలు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. సాక్షాత్తు తాను ఏర్పాటు చేసిన ఈ భేటికి మంత్రి సబిత రాకపోతే విద్యార్థుల ఆత్మహత్యలు, బలవన్మర ణాలు ఎలా ఆగుతాయని ప్రశ్నిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన నార్సింగి శ్రైతన్య కాలేజీలో ఆత్మహత్య చేసుకున్న ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్థి సాత్విక్‌ ఘటనపై 14 కార్పొరేట్‌ కళాశాలల యాజమాన్యాలతో హైదరాబాద్‌లోని ఎంసీహెచ్‌ఆర్‌డీలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది.

సాత్విక్‌ బలవన్మరణం నేపథ్యంలో విద్యార్థుల మీద ఒత్తిడి తగ్గించేందుకు, యాజమాన్యాలు విద్యార్థుల విషయంలో ఇష్టానుసారంగా వ్యవహరించకుండా ఉండేలా దిశానిర్ధేశం చేసేందుకు యాజమాన్యాలకు విద్యాశాఖ మంత్రి ఈ అంశంలో జోక్యం చేసుకొని సాక్షాత్తు ఆమే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఈ సమావేశానికి మంత్రి మొహం చాటేయడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి రాకపోవడంతోటి ఇంటర్‌ బోర్డు ఇంఛార్జీ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ ఈ సమావేశం నిర్వహించారు. అయితే ఈ ఆత్మహత్యలు, ఒత్తిళ్లు తగ్గించేందుకు ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదు. కేవలం తూతూ మంత్రంగా ఈ సమావేశాన్ని నిర్వహించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాత్విక్‌ మరణం తర్వాత విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీల నుంచి ఒత్తిళ్లు పెరగడంతో దాన్ని తట్టుకోలేక ..దాని నుంచి బయటకు రాలేక ఈ సమావేశాన్ని నిర్వహించినట్లు భావిస్తున్నారు.

అయితే సాత్విక్‌ మరణంతోపాటు గత నాలుగైదు ఏండ్లుగా చోటు చేసుకున్న పరిణామాలపై పూర్తి స్థాయిలో విశ్లేషించకుండా కార్పోరేట్‌ యాజమాన్యాలపై చర్యలు తీసుకోకుండా వచ్చే విద్యాసంవత్సరానికి నార్సింగి శ్రీచైతన్య కళాశాల అనుమతులు రద్దు చేస్తున్నట్లు నవీన్‌ మిట్టల్‌ ప్రకటించాడే తప్ప..శ్రీచైతన్య విద్యాసంస్థల యాజమాన్యంపై ఎటువంటి చర్యలు తీసుకున్నట్లు పేర్కొనలేదు. ఒక్క కాలేజీ అనుమతి రద్దు చేయడంవల్ల ఏ మవుతుందనే ధీమాలో వారు ఉన్నట్లుగా విద్యావర్గాల్లో చర్చ జరగుతోంది. దీని వల్ల యాజమాన్యాలకు వచ్చిన నష్టం ఏం ఉంటుందని ఆ కాలేజీ యాజమాన్య వర్గాలు చెప్పుకుంటున్నట్లు సమాచారం. తమకు దీనివల్ల ఉరిగిందేమీ లేదన్నట్లుగా వారి వ్యవహార శైలి ఉన్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నార్సింగిలో కాకపోతే పక్కనున్న వేరే ప్రాంతంలో కళాశాలలను ఏర్పాటు చేసుకొని వచ్చే విద్యాసంవత్సరానికి అడ్మిషన్లు భర్తీ చేసుకుంటామనే ధోరణీలో వారున్నట్లుగా విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తంగా విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి నిర్వహించిన ఈ సమావేశం తుస్సు మన్నది. కార్పొరేట్‌ కాలేజీ యాజమాన్యాలకు ఉపయుక్తంగా ఉండేలా మంత్రి వ్యవహరించినట్లు విద్యార్థి, అధ్యాపక, రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

కేవలం క్షమాపణలు సరిపోతాయా?…
ఇదిలా ఉంటే సాత్విక్‌ ఘటనపై శ్రీచైతన్య యాజమాన్యం ఇంటర్‌ బోర్డుకు క్షమాపణ చెప్పింది. అయితే కాలేజీ యాజమాన్యంపై ఇంటర్‌ విద్యా కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కేవలం క్షమాపణ చెబితే సరిపోతుందా..అది చిన్నపదమని మండిపడ్డారు. కళాశాల పర్మిషన్‌ రద్దు చేస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారు. కాలేజీలు అదనపు బ్రాంచీలు నిర్వహించొద్దని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement