Friday, November 22, 2024

Special Story: నా..రా..య‌..ణ‌…ఇదో కార్పొరేట్ కాల‌నాగు!

- Advertisement -

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: నారాయణ విద్యా సంస్థలు ఉభయ రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న కళాశాలల్లో సగానికిపైగా అనుమతి లేనివేనని తెలు స్తోంది. ఒక కళాశాలలో విద్యార్థులకు ప్రవేశాలు కల్పించి మరో కళాశాల ద్వారా వారితో పరీక్షలు రాయిస్తున్నట్లు తెలంగాణ ఇంటర్‌ విద్యా మండలి ఇటీవల జరిపిన తనిఖీల్లో వెల్లడైంది. సంబంధిత కళాశాల యాజమాన్యాలపై చర్యలు తీసుకునేందు కు ఇంటర్‌ బోర్డు సమాయత్తమైనా యాజమాన్యా లు తమకున్న పలుకుబడిని ఉపయోగించి చర్యల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు తెలు స్తోంది. తామరతంపరగా వెలుస్తున్న నారాయణ విద్యా సంస్థ జూనియర్‌ కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు పొంద కుండానే యథేచ్ఛగా ప్రవేశాలు జరుపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇంటర్‌ బోర్డు అడ్మిషన్ల నోటిఫికేషన్‌ ప్రకటించక మునుపే ఈ విద్యాసంస్థ యాజమాన్యం పెద్ద ఎత్తున ప్రవేశాలు చేపట్టినట్టు తెలుస్తోంది. పదో తరగతి పరీక్షల ఫలితాలు వెలువడక ముందే ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో లక్షల రూపాయల ఫీజులను దండుకుని ప్రవేశాలకు శ్రీకారం చుట్టినట్టు సమాచారం.

అడ్మిషన్ల నోటిఫికేషన్‌ వెలువడక ముందే ఏ కళాశాల యాజమాన్యమైనా ప్రవేశాల ప్రక్రియ ప్రారంభిస్తే ఆ కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని,అ వసరమైతే అనుమతులు రద్దు చేస్తామని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి హెచ్చరికలు జారీ చేసినా ఈ విద్యా సంస్థ ఆ హెచ్చరికలను బేఖాతరు చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యార్థి సంఘాలు ఈ కళాశాలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి వినతిపత్రాలు ఇచ్చినా ప్రయోజనం లేకుండాపోతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో హెడ్‌మాస్టర్లుగా పనిచేస్తున్న వారిని లోబరుచుకుని వారి ద్వారా ఈ విద్యాసంస్థ యాజమాన్యం ఇంటర్‌లో ప్రవేశాలు కల్పిస్తున్నట్టు తెలు స్తోంది. విద్యార్థులను వారి కళాశాలల్లో ప్రవేశాలు కల్పించినందుకు హెడ్మాస్టర్‌కు ఒక్కో ప్రవేశానికి రూ.10 నుంచి 20 వేల పారితోషికం చెల్లిస్తున్నట్టు సమాచారం. అడ్మిషన్ల సమయంలో ఒక్కో హెడ్మాస్టర్‌ రూ.లక్ష నుంచి 5 లక్షలు జేబుల్లో వేసు కుంటున్నట్లు చెబుతున్నారు. కార్పోరేట్‌ కళాశాలల యాజమాన్యాలు ప్రజా సంబంధాల వ్యవస్థను ఏర్పాటు చేసుకుని వారి ద్వారా పెద్ద ఎత్తున ప్రవేశాలు కల్పిస్తు న్నట్టు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందినా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ఒక ప్రాంతంలో ఒక భవనాన్ని చూపి ఆ భవనంలో కళాశాలను ఏర్పాటు చేస్తున్నట్టు నమ్మబలికిన నారాయణ విద్యా సంస్థలు అనుమతులకు సంబంధించి ఉత్తర్వులు జారీ అయ్యాక ఆ కళాశాలను మరో ప్రాంతానికి మార్చి అక్కడ తరగతులను నిర్వహిస్తున్నట్టు ఇంటర్‌ బోర్డుకు కోకొల్లలుగా ఫిర్యాదులు వచ్చినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. తమకున్న రాజకీయ పలుకుబడిని ఉపయోగించి ఈ విద్యాసంస్థల యాజమాన్యాలు ఇంటర్‌ బోర్డును సైతం తమ గుప్పిట్లో పెట్టుకుని వ్యవహారం నడుపుతున్నట్టు తెలుస్తోంది. కళాశాల అనుమతులు, పరీక్షల నిర్వహణ తదితర వ్యవహారాలను చక్కదిద్దేందుకు ఈ విద్యాసంస్థల నిర్వాహకులు ప్రత్యేకంగా ప్రిన్సిపల్‌ స్థాయిలో పనిచేసే కొంతమందిని నియమించుకుని వారి ద్వారా మంత్రాంగం నడుపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

కొత్త జూనియర్‌ కళాశాలలకు అనుమతులు ఇవ్వడాన్ని నిషేధించినా ఈ విద్యా సంస్థ యాజమాన్యం ప్రభుత్వ పెద్దలతో మాట్లాడుకుని అనుమతులు పొందుతు న్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మూడేళ్ల క్రితం వరకు హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌ వంటి నగరాల్లో కళాశాలలను ఏర్పాటు చేసుకున్న ఈ విద్యా సంస్థ క్రమంగా నియోజకవర్గ కేంద్రాలు, ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ విద్యాసంస్థలను ఏర్పాటు చేసి అక్కడ విద్యార్థుల ద్వారా భారీ ఎత్తున ఫీజులను దండుకుంటున్నట్లు అరోపణలు ఉన్నాయి. తమ కళాశాలలో చేరితే ఐఐటీ, జేఈఈ, నీట్‌లో మంచి ర్యాంకులు వస్తాయని, ప్రపంచ శ్రేణి విద్యాసంస్థల్లో ప్రవేశాలు లభ్యమవుతాయని భారీ ప్రకటనలు గుప్పించి, విద్యార్థులు, వారి తల్లిదండ్రులను తమవైపుకు తిప్పుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇంటర్‌తోపాటు ఎంసెట్‌, ఇతర ప్రవేశ పరీక్షల్లో విద్యార్థులు పొందిన ర్యాంకులను బహిరంగంగా ప్రకటించరాదని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ నారాయణ విద్యా సంస్థ అవేమీ పట్టించుకోకుండా తమకు రాని ర్యాంకులను తమ ర్యాంకులుగా చెప్పుకుని విద్యార్థులను మభ్యపెడుతున్నట్లు ప్రచారం జరుగుతోందని తప్పుడు, ఆకర్షణీ యమైన ప్రకటనలను చూసి విద్యార్థులు ఈ విద్యా సంస్థ వలలో చిక్కుకుని తద్వారా ప్రవేశాలు పొందుతున్నట్లు సమాచారం. ఇంటర్‌ బోర్డు అనుమతులు పొందిన కొన్ని అన్‌ ఎయిడెడ్‌, ప్రయివేటు జూనియర్‌ కళాశాలల యాజమాన్యాలతో ఒప్పందం కుదుర్చుకుని ఆ కళాశాలల ద్వారా విద్యార్థులను పరీక్షలకు పంపిస్తున్నట్టు సమాచారం. ఇందుకు ఆ కళాశాల యాజమాన్యానికి ఒక్కో అడ్మిషన్‌కు రూ.10 వేల నుంచి రూ.20 వేలు చెల్లిస్తున్నట్టు చెబుతున్నారు. ఐఏఎస్‌ అకాడమీ పేరుతో ఇంటర్‌తోపాటు డిగ్రీ, ఆ తర్వాత సివిల్‌ సర్వీస్‌ కోచింగ్‌ ఇస్తామని నమ్మబలుకుతున్న ఈ కళాశాల యాజమాన్యం ఇందుకోసం విద్యార్థుల నుంచి లక్షల రూపాయల ఫీజులను దండుకుంటున్నట్టు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఆ ప్రభుత్వ పెద్దలకు కొమ్ముకాయడం ఈ కళాశాల యాజమాన్యానికి అలవాటుగా మారింది. ఈ కళాశాల యాజమాన్యం చేస్తున్న అక్రమాలను ప్రశ్నించే విద్యార్థి సంఘాల నాయకులపై అక్రమ కేసులు బనాయించి వారిని చెరసాలకు పంపిస్తున్న ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. కళాశాలల్లో అనుమతులు మంజూరైన సెక్షన్లకు రెట్టింపుగా ప్రవేశాలు జరుపుతున్నట్టు కూడా ఇంటర్‌ బోర్డుకు ఫిర్యాదులు వచ్చినా ఫలితం లేకుండా పోతోంది. ఈ కార్పోరేట్‌ కళాశాలను నియంత్రించి జరుగుతున్న అక్రమాలపై చర్యలు తీసుకోవాల్సిన జిల్లా ఇంటర్‌ బోర్డు అధికారులు (డీఐఈవో) యాజమాన్యంతో చేతులు కలిపి వారిచ్చే ఆమ్యామ్యాలు తీసుకుని.. చేసిన అక్రమాలకు ఆమోదం తెలుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో నారాయణ యాజమాన్యం రెచ్చిపోయి యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నట్టు సమాచారం.

కార్పోరేట్‌ కళాశాలల్లో పనిచేసే బోధనా సిబ్బంది జవాబు పత్రాల మూల్యాంకనానికి హాజరవ్వాలన్న కచ్చితమైన ఆదేశాలు ఉన్నా వీరెవరూ ఈ ప్రక్రియకు హాజరుకావడం లేదని సమాచారం. ప్రభుత్వ, అన్‌ ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలల్లో పనిచేస్తున్న బోధనా సిబ్బంది మూల్యాంకన ప్రక్రియకు హాజరుకాకపోతే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్న ఇంటర్‌ బోర్డు నారాయణ కళాశాలల అధ్యాపకులపై మాత్రం మూల్యాంకనం నుంచి మినహాయింపు ఇవ్వడంపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తంగా నారాయణ విద్యా సంస్థ అక్రమాలకు ముకుతాడు వేయకపోతే భవిష్యత్‌లో ప్రభుత్వ, ప్రయివేటు జూనియర్‌ కళాశాలల భవితవ్యం అంథకారంగా మారుతుందని ఈ కళాశాలలు విద్యార్థులు లేక మూతపడినా ఆశ్చర్యపోనవసరం లేదని చెబుతున్నారు. ఇప్పటికే విద్యార్థులలేమితో కునారిల్లుతున్న ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు రానున్న కాలంలో వీటి పరిస్థితి అగమ్య గోచరంగా మారుతున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement