ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఏరియల్ సర్వే పేరుతో గాల్లో తిరుగుతున్నారని, నేలకు దిగితే జనం వరద కష్టాలు కనిపిస్తాయని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకుని శాడిస్టిక్ ఆనందం పొందారని మనం చరిత్ర పుస్తకాలలో చదువుకున్నామని, ఇప్పుడు నీరోకి మరో రూపం జగన్‌రెడ్డిని ప్రత్యక్షంగా చూస్తున్నామన్నారు. తాను పుట్టిన గడ్డ, తనకి అధికారం కట్టబెట్టడంలో కీలకపాత్ర పోషించిన రాయలసీమ మొత్తం అకాలవర్షాలకు అల్లకల్లోలమైతే కనీసం అటువైపు కన్నెత్తి చూసే ఆలోచన కూడా జగన్‌రెడ్డికి రాలేదన్నారు. మరోవైపు అదానీతో విందులు-వాటాల చర్చలు, కుప్పంలో ఓడిపోయిన చంద్రబాబు మొఖం చూడాలనే సైకో కోరికలతో తనకు జనం కష్టాలు పట్టవని స్పష్టంగా ముఖ్యమంత్రి చెప్పకనే చెబుతున్నారు. వాతావరణ హెచ్చరికలను పట్టించుకోకుండా క్షుద్రరాజకీయాలలో గడిపిన జగన్ ప్రభుత్వ వైఫల్యం వల్లే రాయలసీమలో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందని ఆరోపించారు. కుప్పంలో దొంగ ఓట్లు వేయించే శ్రద్ధ ముంపులో ఉన్న బాధితుల పట్ల కనబరిచితే కొందరికైనా సాయం అందేదన్నారు. రాష్ట్రంలో ఎడతెరిపి లేకున్నా కురుస్తున్న భారీ వర్షాలకు సీఎం సొంత కడప జిల్లాలో 30 మంది గల్లంతవ్వగా 12 మంది చనిపోతే..ఏం జరిగిందో కనుక్కునే తీరిక లేని ముఖ్యమంత్రిని ఏమనాలి? వరదలకు వాగులు, నదులు పొంగిపొర్లుతూ డ్యాములు ప్రమాదకరస్థితికి చేరి రాష్ట్రానికి వరద ముప్పు ఉందని తెలిసినా ముఖ్యమంత్రి పట్టించుకునే తీరికలేకుండా తన వ్యాపారలావాదేవీలు, పారిశ్రామికవేత్తలతో కమీషన్ల భేటీలు జరుపుకోవడం సిగ్గుచేటన్నారు.
గల్లంతైన వారి ఆచూకీ తెలియక కుటుంబసభ్యుల ఆందోళనలు, జలదిగ్బంధంలో గ్రామాలు, నిరాశ్రయులైన ప్రజలు, పోయిన ప్రాణాలు, కొట్టుకుపోయిన పంటలు, మృత్యువాతపడిన గేదెలు-ఆవులు, జీవాలు …ఇదే రాయలసీమ, నెల్లూరులో వరద ముంపులో కనిపించే విషాద దృశ్యాలు. గాల్లో తిరిగితే ఈ విషాదాలు సీఎంగారికి ఎలా కనిపిస్తాయి? అందుకే నేలమీద ఈ కష్టాలు చూడాలని కోరుతున్నాను. వరదకష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం వస్తుందని ఎదురుచూడటం వృథా, ముంపుబాధితులకు సాయమందించేందుకు అధికారులు వస్తారనేది భ్రమ. తెలుగుదేశం పార్టీ అధికారంలో వున్నప్పుడు హుదుద్, తిత్లీ వంటి మహావిలయాల సమయంలోనూ బాధితులకు అండగా నిలిచాం..ఇప్పుడు అధికారం మనకు లేకపోయినా, సాయం చేసే మనసు-స్పందించే మానవత్వం ఉంది. తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు, ఇతర అనుబంధ విభాగాలు వరద ముంపు ప్రాంతాలలో బాధితులకు మీకు చేతనైన సాయం చేయండి..ఆపదలో వున్నవారిని ఆదుకోండని తెలిపారు.