తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగుల్లో 11 మంది ఆక్సిజన్ అందక మరణించిన ఘటనపై టీడీపీ నేత లోకేశ్ తీవ్రంగా స్పందించారు. అత్యాధునిక సౌకర్యాలు ఉన్న రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అయిపోయేంత వరకు పట్టించుకోకపోవడం ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతోందని దుయ్యబడుతూ రుయా ఆసుపత్రిలో రోగులు పడుతున్న అవస్థల వీడియోను ఆయన ట్వీట్ చేశారు. ఈ ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్న లోకేశ్.. ఇవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనన్నారు. ఆక్సిజన్ అందక బాధితులు మరణించడం బాధాకరమన్నారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో మరో 13 మంది పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోందని, వారికి సకాలంలో ఆక్సిజన్ అందించి వారి ప్రాణాలు నిలపాలని కోరారు. ప్రజల ప్రాణాలంటే ముఖ్యమంత్రికి లెక్కలేదని, అసలు ఇలా ఎందుకు జరుగుతోందని కూడా ఆయన ఆరా తీయడం లేదని ధ్వజమెత్తారు. ఇక ఘటనపై అచ్చెన్నాయుడు స్పందిస్తూ చేతకాని పాలనతో జగన్ ప్రజల ప్రాణాలు తీస్తున్నారని, ఆయనపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రుయా మృతుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.