దక్షిణాఫ్రికాలో గుర్తించిన కొవిడ్-19 కొత్త వేరియంట్‌కి ప్రపంచ ఆరోగ్య సంస్థ కొత్త పేరు పెట్టింది. అదిప్పుడు అందరినోట ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయి పోయింది అదే ఒమిక్రామన్. కరోనావైరస్ పుట్టింది మొదలు ఇలా ఎప్పటికప్పుడు కొత్త కొత్త వేరియంట్లు వస్తూనే ఉన్నాయి. వాటిని కొత్త కొత్త పేర్లతో పిలవడం చూస్తూనే ఉన్నాం. ఇదంతా చూస్తోంటే చాలా మందికి ఓ సందేహం రాకమానదు. అదేంటంటే.. అసలు కరోనా కొత్త వేరియంట్స్‌కి ఈ పేర్లు పెట్టేది ఎవరు? వాటికి ఆ పేర్లు ఎలా పెడతారు.. ఆ పేర్లే ఎందుకు పిలవాలి అనే సందేహం చాలామందిలో ఉంటుంది. ఆ వివరాలు ఈ స్టోరీ చదివి తెలుసుకోండి
ఒమిక్రాన్ అనేది గ్రీకు భాషలో 15వ అక్షరం. మనం ఇంగ్లిషులో రాసినట్టే పెద్ద ” O ” అనేది పెద్ద అక్షరం కాగా ” o ” అనేది చిన్న ఓ అక్షరానికి చిహ్నంగా ఉంటుంది. డిక్షనరి సూచిస్తున్న అర్థం ప్రకారం ఒమిక్రాన్ అంటే గ్రీకు భాషలో ” చిన్న ఓ ” అనే అర్థం వస్తుందట. కరోనావైరస్ కొత్త వేరియంట్స్‌కి గ్రీకు భాష ఆధారంగా పేర్లు పెట్టనున్నట్టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ ఏడాది మే నెలలోనే ప్రకటించింది. కొన్ని రకాల కొత్త వేరియంట్స్‌కి అవి తొలిసారి గుర్తించిన దేశాన్నిబట్టి పేరు పెట్టినప్పటికీ.. ఇది సరైన పద్ధతి కాదనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అభిప్రాయం.
అందుకే సైన్స్ గురించి పెద్దగా తెలియని వారికి కూడా అర్థమయ్యే భాషలో ఉండాలనే ఉద్దేశంతోనే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గ్రీకు అక్షరాలను ఎంచుకుంది. ఈ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంకా ఏం చెబుతోందంటే.. ఏ దేశంలోనైతే కొత్త వేరియంట్ పుట్టిందో.. ఆ దేశం పేరుతో వైరస్‌కి పేరు పెట్టి పిలవడం కారణంగా ఆ దేశాన్ని ఇతర దేశాలు వివక్షతతో చూసే ప్రమాదం ఉంది. ఇక సైంటిఫిక్ భాషలో కొత్త వేరియంట్‌కి పేరు పెడితే.. ఆ పేరును పిలవడం, గుర్తుంచుకోవడం అందరికీ సాధ్యపడకపోవచ్చు. అందుకే గ్రీకు భాష అక్షరాలను ఎంచుకున్నట్టు గతంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్‌బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..