వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జగడం జరుగుతోంది. తెలంగాణ వడ్లు కొనుగోలు చేయాలంటూ రాష్ట్ర సర్కార్ కోరుతుంటే.. కేంద్ర మాత్రం కొనబోమని స్పష్టం చేసింది. ఈ క్రమంలో యాసంగిలో వరి కొనే పరిస్థితి లేదని తెలంగాణ ప్రభుత్వం రైతులకు స్పష్టం చసింది. ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని రైతులకు సూచిస్తోంది. ఈ నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
యాసంగిలో రైతులు వరి సాగు చేస్తే మంచి ధరకు కొనుగోలు చేయించే బాధ్యత తనదేనంటూ మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు ప్రకటించారు. మిర్యాలగూడతో పాటు నాగార్జునసాగర్ నియోజకవర్గంలో రైతులు యాసంగిలో సన్న ధాన్యం పండిస్తే.. మంచి ధరకు మిల్లర్లతో పంటను కొనుగోలు చేయించేలా చూస్తానని భరోసా ఇచ్చారు. ఈ విషయంలో ఎవరు ఏం చెప్పినా అయోమయానికి గురికావాల్సిన అవసరం లేదన్న ఆయన.. వరి సాగు కోసం నాగార్జునసాగర్ ఎడమకాల్వకు నీటిని కూడా విడుదల చేయిస్తానని హామీ ఇచ్చారు. కాగా, ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..