మంచి పనికోసమే అయినా.. వారు ఎంచుకున్న విధానం అందరిని విస్మయానికి గురిచేస్తోంది. సురక్షిత సైక్లింగ్‌ను కోరుతూ కొంతమంది నగ్నంగా ర్యాలీ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఇది మెక్సీకోలో జరగగా దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
తమకు సురక్షితంగా సైకిలింగ్ చేసుకునే అవకాశాన్ని కల్పించాలని మెక్సికోలోని సైకిలిస్టులు వినూత్నంగా ఆందోళన నిర్వహించారు. మెక్సికో రాజధానిలోని అత్యంత రద్దీగా ఉండే రూట్లలో నిరసనకారులు నగ్నంగా సైకిల్ తొక్కారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొవిడ్ 19 కారణంగా సామూహికంగా గుమికూడటంపై ఆంక్షలు విధించడంతో ఈ తరహా నిరసనలు ఇప్పుడు కనిపించడం లేదు. గడిచిన రెండేళ్లలో మొదటి నగ్న సైకిల్ ప్రదర్శన ఇదే అంటున్నారు పరిశీలకులు.
తొలుత నిరసనకారులు స్థానికంగా ఉన్న విప్లవ స్మారక చిహ్నం వద్ద గుమిగూడారు. అనంతరం చారిత్రాత్మక కేంద్రం, పేస్ డి లా రిఫార్మా అవెన్యూ వీధుల మీదుగా సుమారు 17 కిలోమీటర్లు నగ్నంగా సైకిల్ తొక్కి నిరసన తెలిపారు. అనేక సంవత్సరాలుగా నగర పాలక సంస్థ సైకిళ్ల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నా.. పాదచారులు, సైకిలిస్టుల భద్రతపై ఇప్పటికీ సరైన అవగాహన లేదని నిరసనకారులు తెలిపారు. దీనిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు.