భారీ వర్షాలతో జలాశయాలు నిండు కుండల్లా మారాయి. దాంతో వీటిని చూసేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో నేటి నుంచి నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలానికి లాంచీ సేవలు మొదలయ్యాయి. సాగర్ యాత్రకి అనుమతినిచ్చింది పర్యాటక సంస్థ. దాంతో నేటి ఉదయం తొమ్మిది గంటల నుండి నాగార్జున సాగర్ లో లాంచీ బయలుదేరింది. కాగా సాయంత్రం మూడు గంటలకు శ్రీశైలం చేరుకోనుంది. మళ్లీ మంగళవారం ఉదయం 9 గంటలకు శ్రీశైలం నుంచి లాంచీ బయలుదేరి సాయంత్రం 3 గంటలకు నాగార్జున సాగర్ చేరుకుంటుంది.
కాగా ఈ ఆహ్లాదకర ప్రయాణానికి ఆదివారం సాయంత్రం వరకు 60 టికెట్లు బుక్ అయినట్లు అధికారులు తెలిపారు. సాగర్ నుంచి శ్రీశైలానికి పెద్దలకు రూ.1,500. పిల్లలకు రూ.1,200. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ వైపు కూడా ఇదే ఛార్జీ వర్తిస్తాయి. రెండు వైపులా ప్రయాణమైతే పెద్దలకు రూ. 2,500, పిల్లలకు – రూ.2,000 ఛార్జీ తీసుకుంటారు. ఇక హైదరాబాద్ నుంచి బస్ ప్యాకేజీతో కలిపి పెద్దలకు రూ.3,999, పిల్లలకు రూ.3,399 వసూలు చేస్తున్నారు. దాంతో పర్యాటక ప్రేమికులకు పండగే పండగ. ప్రకృతిని ఆహ్వాదించేందుకు ఇదే మంచి తరుణం కూడా.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..