టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఆకస్మిక మరణంతో నాగార్జున సాగర్ ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ ఉపఎన్నిక నామినేషన్లు మంగళవారం నుండి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ నుండి సీనియర్ నేత జానారెడ్డి బరిలో ఉండగా, టీఆర్ఎస్ టికెట్ ఎవరికి అనేది క్లారిటీ లేదు. తెలంగాణ రాష్ట్రంలో మరణాలతో ఏర్పడిన జరిగిన ఏ ఎన్నికల్లోనూ కుటుంబ సభ్యులు గెలిచిన దాఖలాలు లేవు. దీంతో ఈసారి నోముల కుటుంబానికి టికెట్ వస్తుందా? అనే చర్చ చాలా రోజులుగా సాగుతోంది.
అయితే, ఇది బీసీ నాయకుడికి ఇచ్చిన టికెట్ కావటంతో ఇక్కడ బలమైన సామాజికవర్గంగా ఉన్న యాదవులకే టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల వరకు వేచి చూసిన కేసీఆర్… ఇప్పుడు పార్టీ టికెట్‌పై తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ‘రెడ్డి’ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వటంతో… టీఆర్ఎస్ పార్టీ నోముల కుమారుడు భగత్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే భగత్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. నామినేషన్ వేసేందుకు కూడా ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నట్లు సమాచారం. పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసి పనిచేయాల్సిందేనని ఇప్పటికే కీలక నేతలకు సీఎం కేసీఆర్ సమాచారం ఇచ్చారు. పైగా మండలానికో ఎమ్మెల్యేను, మున్సిపాలిటీకో కీలక నాయకున్ని పెట్టి టీఆర్ఎస్ ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. మరోవైపు గత ఎన్నికల్లో టీడీపీ టికెట్‌పై పోటీ చేసి, ఆ తర్వాత బీజేపీలో కొనసాగుతున్న అంజయ్య యాదవ్ వైపు కమలం పార్టీ మొగ్గుచూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.