Thursday, November 21, 2024

కొన్ని గంటల్లో ఉపఎన్నిక ఫలితాలు.. పార్టీల్లో మొదలైన టెన్షన్!

తెలుగురాష్ట్రాల్లో ఉత్కంఠ రేపిన తిరుపతి, నాగార్జనసాగర్ ఉప ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడికానున్నాయి. ఏప్రిల్ 17న ఏపీలోని తిరుపతి లోక్ సభ స్థానానికి, తెలంగాణలోని నాగార్జనసాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించారు. ఆదివారం ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు. అందుకోసం అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. తిరుపతి లోక్ సభ స్థానానికి సంబంధించిన ఎస్వీ ఆర్ట్స్ కాలేజీలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కౌంటింగ్ అధికారులకు, ఏజెంట్లకు కరోనా పరీక్షలు చేశారు. నెగెటివ్ రిపోర్టు వచ్చినవారినే కౌంటింగ్ కేంద్రం లోపలికి అనుమతించనున్నారు.

ఆదివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లు, ఆపై ఈవీఎం ఓట్లను లెక్కించనున్నారు. ఒక్క తిరుపతి సెగ్మెంట్ కోసమే 4 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి కౌంటింగ్ కేంద్రంలో 6 చొప్పున టేబుళ్లు ఏర్పాటు చేశారు. రేపు మధ్యాహ్నం కల్లా ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. కరోనా తీవ్రత దృష్ట్యా విజయోత్సవ వేడుకలు, ర్యాలీలపై ఈసీ నిషేధం విధించింది.

మరోవైపు ఎన్నికల ఫలితాల నేపథ్యంలో పార్టీలో టెన్షన్ నెలకొంది. ఇప్పటికే వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అధికార పార్టీలకు అనుకూలం వచ్చాయి. ఇరు రాష్ట్రాల్లో అధికార పార్టీలే గెలుస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. దీంతో ఏపీలో వైసీపీ, తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీలు సంబరాల్లో మునిగిపోయాయి. అయితే, తుది ఫలితం  ఎలా ఉంటుందని అనేది ఉత్కంఠగా మారింది.

తెలంగాణలో టీఆర్‌ఎస్‌ పార్టీ తిరిగి నాగార్జునసాగర్‌ స్థానాన్ని కైవసం చేసుకుంటుందని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి. నాగార్జునసాగర్‌ అసెంబ్లీ ఉప ఎన్నికపై ఆరా, ఆత్మసాక్షి అనే సంస్థలు ఎగ్జిట్ పోల్స్‌ విడుదల చేశాయి. పోలైన ఓట్లు ఎవరికి ఎంత శాతం వస్తాయో ఇలా అంచనా వేశాయి. ఆరా అనే సంస్థ టీఆర్‌ఎస్‌‌కు 50.48 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని, కాంగ్రెస్‌కు 39.93 శాతం, బీజేపీకి 6.31 శాతం వస్తాయని అంచనా వేసింది. ఆత్మసాక్షి అనే సంస్థ టీఆర్‌ఎస్‌ – 43.5 శాతం, కాంగ్రెస్ – 36.5 శాతం, బీజేపీ – 14.6 శాతం అని అంచనా వేసింది.

నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సయ్య మరణంతో ఆ స్థానంలో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. దీంతో ఏప్రిల్‌ 17వ తేదీన ఉప ఎన్నిక జరిగింది. టీఆర్‌ఎస్‌ నుంచి నోముల భగత్‌, కాంగ్రెస్‌ నుంచి జానారెడ్డి, బీజేపీ రవి నాయక్‌ మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. అయితే, భగత్, జానారెడ్డి మధ్య గట్టి పోటీ మొదటి నుంచి నెలకొంది. 

ఇక, ఏపీలో వైఎస్సార్‌సీపీ తన సిట్టింగ్‌ స్థానాన్ని మళ్లీ సొంతం చేసుకుంటుందని అన్ని సర్వేలు తేల్చి చెప్పాయి. ఆరా సంస్థ సర్వే ప్రచారం వైఎస్సార్‌సీపీ 65.85 శాతం ఓట్లు దక్కించుకున్నట్లు అంచనా వేసింది. టీడీపీకి 23.10 శాతం ఓట్లు, బీజేపీకి 7.34 శాతం, ఇతరులకు 3.71 శాతం ఓట్లు వస్తాయంటోంది. ఎగ్జిట్‌ పోల్ ఫలితాలకు తుది ఫలితాలకు 2 నుంచి 3 శాతం వరకు తేడా ఉండొచ్చని వెల్లడించింది. ఆత్మసాక్షి ఎగ్జిట్‌ పోల్ ఫలితాల ప్రకారం వైఎస్సార్‌ సీపీ 59.25%, టీడీపీ 31.25%, బీజేపీ 7.5% ఓట్లు సాధిస్తాయి పేర్కొంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి ఎంపీగా ఎన్నికైన బల్లి దుర్గాప్రసాదరావు గతేడాది సెప్టెంబరు 16న కరోనాతో మరణించడంతో ఆ స్థానం ఖాళీ అయింది. ఈ మేరకు అక్కడ ఈ నెల 17న ఉప ఎన్నిక నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ నుంచి డాక్టర్ గురుమూర్తి, టీడీపీ నుంచి కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, బీజేపీ నుంచి రిటైర్డ్ ఐఏఎస్ రత్నప్రభలు పోటీ చేశారు.

- Advertisement -

ఎన్నికల ప్రచారం సందర్భంగా అధికార, విపక్ష పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేశాయి. ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోస్తున్నారు. అంతేకాదు గెలుపు తమదే అని, మెజారిటీ ఎంత వస్తుందని అనేదానిపై మాత్రమే తమ దృష్టి ఉందని అటు టీఆర్ఎస్, అటు వైసీపీ ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ప్రజాతీర్పు ఎలా ఉంటుందనేది చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement