హైదరాబాద్, ఆంధ్రప్రభ : మూడు రోజుల క్రితం హైదరాబాద్లోని సరూర్నగర్లో జరిగిన నాగరాజు హత్యపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. పార్టీ కేంద్ర కార్యాలయం దారుస్సలాంలో మీడియాతో మాట్లాడిన ఆయన యువతి ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకుంటే ఆమె భర్తను చంపే హక్కు ఎవరికీ లేదన్నారు. ఇది నేరపూరిత చర్య అని, రాజ్యాంగంతో పాటు ఇస్లాం కూడా ఇలాంటి వాటిని అంగీకరించదన్నారు.
అయితే ప్రేమ వ్యవహారంలో జరిగిన ఈ హత్యకు కొందరు మతం రంగు పులుముతున్నారని మండిపడ్డారు. ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే నిందితులను పోలీసులు అరెస్టుచేశారని, తాము హంతకుల పక్షాన నిలబడబోమని స్పష్టం చేశారు. బీజేపీ నేతలు ఈ హత్యకు మతం రంగు పులమడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. చేసేది తప్పు అయితే ఏ మతమైనా క్షమించరాదన్నారు.