Friday, November 22, 2024

తెలుగు రాష్ట్రాల్లో N440K వేరియంట్!

కరోనా మహమ్మారి కొత్తరూపం సంతరించుకోవడంతో ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే పలు రకాల మ్యుటేషన్స్ తో కూడిన కోవిడ్-19 వేరియంట్‌ ను పరిశోధకులు దేశంలో గుర్తించారు. . సెకండ్‌ వేవ్‌ లో వైరస్‌ వేగంగా విస్తరిస్తున్నట్లు కేసుల సంఖ్య చెప్పకనే చెబుతోంది. ఈ నేపథ్యంలో తీవ్రతను అంచనా వేయడంపై సీసీఎంబీ శాస్త్రవేత్తలు దృష్టిపెట్టారు. తెలుగు రాష్ట్రాల్లో N440K అనే వేరియంట్‌ ను శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో నమోదయిన పలు కేసులను విశ్లేషించగా.. దాదాపు 4-5 శాతం జన్యుపరంగా మార్పిడి చెందిన N440K అనే వేరియంట్‌ ను కనుగొన్నారు. ఈ వేరియంట్ ఇప్పటికే గుజరాత్, మహారాష్ట్రలో కూడా గుర్తించినట్టు సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయోలజీ (సిసిఎంబి) డైరెక్టర్ డాక్టర్ ఆర్కే మిశ్రా తెలిపారు.

N440K మ్యుటేషన్ చాలా కాలం నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో ఉందని, అయితే, ఇటీవల ‘డబుల్ మ్యూటాంట్’ వేరియంట్ పరీక్షించిన నమూనాలలో కేవలం నాలుగైదు శాతం మాత్రమే కనుగొన్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా నమోదయిన కోవిడ్ -19 జన్యువులలో N440K వేరియంట్‌ ఉందన్నారు. 

ప్రస్తుత పరిస్థితుల్లో జనం రద్దీ ఎక్కువగా ఉండే ప్రజారవాణా, మాల్స్‌, పాఠశాలలు, పరిశ్రమలు, గృహ సముదాయాల్లో వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉంటుందని డాక్టర్ మిశ్రా తెలిపారు. కొవిడ్‌ రెండోవేవ్‌ నేపథ్యంలో సీసీఎంబీ ప్రయోగశాలలోనూ పరీక్షలను రెట్టింపు చేశాం. వైరస్‌ జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ సంఖ్యనూ పెంచామని మిశ్రా చెప్పారు.  ‘‘జనం ఎక్కువగా గుమిగూడే మీటింగ్‌లు, ఫంక్షన్ల వంటివాటికి వెళ్లొద్దు. వృద్ధులు, పేషెంట్లు జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ చేతులను శానిటైజర్లతో కడుక్కోవాలి. షాపింగ్ మాల్స్ వంటి ప్రదేశాలకు వెళ్తే తలుపులు, కిటికీలు, ఐరన్ రెయిలింగు‌లను తాకకుండా జాగ్రత్త పాటించాలి. దగ్గు, జలుబు ఉన్నవారికి కొంచెం దూరంగా ఉండాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే చాలు.. కరోనా వైరస్ వ్యాపించకుండా అడ్డుకోవచ్చు” అని  సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement