– డిజిటల్ మీడియా, ఆంధ్రప్రభ
టాటాసన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ మరణానికి గల కారణాలపై విచారణ బృందం సీరియస్‌గా పరిశోధిస్తోంది. ఇది వాంటెడ్‌గా జరిగిందా? లేక యాక్సిడెంటల్‌గా జరిగిందా అనే అంశాలపై ఫోకస్ పెట్టారు అధికారులు. అయితే.. ప్రమాదం జరగడానికి ఐదు సెకన్ల ముందు కారు గంటకు 100 కిలోమీటర్ల (కిమీ) వేగంతో వెళుతోందని లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడిస్ కంపెనీ తెలిపింది. ప్రాంతీయ రవాణా కార్యాలయం (RTO) కూడా తమ ప్రాథమిక నివేదికను పోలీసులకు సమర్పించింది.
సైరస్ మిస్త్రీ మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి మెర్సిడెస్ బెంజ్ కారులో ఉండగా డ్రైవర్ అనహిత పండోలే వాహనం నడుపుతున్నారు. వేగవంతమైన వాహనాన్ని నడపడంలో నియంత్రణ కోల్పోవడంతో రోడ్డు డివైడర్‌లోకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మరణించిన సైరస్ మిస్త్రీ, జహంగీర్ పండోలే అప్పుడు కారు వెనుక సీట్లో ఉన్నారు. ఇంతలో కారు నడుపుతున్న అనహిత పండోలే, ప్యాసింజర్ సీటులో కూర్చున్న డారియస్ పండోలే ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. తదుపరి చికిత్స కోసం వారిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
మెర్సిడెస్ తన నివేదికలో ఏం చెప్పిందంటే..
ప్రమాదం జరగడానికి ఐదు సెకన్ల ముందు వాహనం వేగం గంటకు 100 కిలోమీటర్లు (కిమీ)గా ఉందని మెర్సిడెస్ బెంజ్ తన నివేదికలో పేర్కొంది. అనహిత బ్రేకులు వేయడం.. డివైడర్‌ను ఢీకొనన్నప్పుడు దాదాపు కారు వేగం 89 కిలోమీటర్లకు తగ్గిందని కంపెనీ తన పరిశీలనలో వెల్లడయినట్టు తెలిపింది. ఇక.. కారు 100 కి.మీ వేగంతో నడుపుతున్నప్పుడు బ్రేకులు అప్లయ్ చేసింఆ? లేదా అంతకు ముందు బ్రేకులు వేసిందా? అని పోలీసులు కంపెనీని అడిగారు. అయితే.. ఎన్నిసార్లు బ్రేక్ వేసారో అన్న విషయం కూడా తెలియజేయాలని కోరారు.
దీనికి సంబంధించి మరింత సమాచారం సేకరించేందుకు.. ప్రమాదానికి గురైన వాహనాన్ని మెర్సిడెస్ కంపెనీ సెప్టెంబర్ 12న తన షోరూమ్‌కు తీసుకెళ్లనుంది.హాంకాంగ్ నుండి ఒక బృందం వచ్చి కారును పరిశీలించి వివరణాత్మక నివేదికను ఇస్తుందని పోలీసులు తెలిపారు. హాంకాంగ్‌కు చెందిన బృందం వీసా కోసం దరఖాస్తు చేసిందని, వచ్చే 48 గంటల్లో ఆ టీమ్ రాకపోతే భారతదేశం నుండి వచ్చిన బృందమే వాహనాన్ని తనిఖీ చేసి వివరణాత్మక నివేదికను తయారు చేస్తుందని అధికారుల ద్వారా తెలుస్తోంది.
రవాణా కార్యాలయం నివేదికలో ఏముంది?
ప్రమాదం జరిగినప్పుడు వాహనంలో మొత్తం నాలుగు ఎయిర్‌బ్యాగ్‌లు ఓపెన్ అయినట్టు ప్రాంతీయ రవాణా కార్యాలయం (ఆర్‌టీఓ) తన నివేదికలో పేర్కొంది. ఆ నాలుగు ఎయిర్‌బ్యాగ్‌లు కూడా వాహనం ముందు భాగంలోనే ఉన్నాయి. ఓపెన్ అయిన నాలుగు ఎయిర్‌బ్యాగ్‌లలో డ్రైవర్ తల ముందు ఒకటి, డ్రైవర్ మోకాళ్ల దగ్గర ఒక ఎయిర్‌బ్యాగ్, డ్రైవర్ తలపై తెరుచుకునే ‘కర్టెన్ ఎయిర్‌బ్యాగ్’తో పాటు.. ముందు భాగంలో ప్రయాణికుల సీటు ముందు తెరవబడిన ఒక ఎయిర్‌బ్యాగ్ ఉన్నాయి. కానీ, వెనుక సీట్లో కూర్చున వారికి ఎట్లాంటి ప్రొటెక్షన్ లేకుండా పోయింది.