తన భార్య తనపై అలిగిందని ఆమె అలకతీర్చేందుకు లీవ్ కావాలని ఓ కానిస్టేబుల్ ఏఎస్పీకి లీవ్ లెటర్ రాయడం వైరల్ గా మారింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మహారాజ్‌గంజ్ జిల్లాలో చోటు చేసుకుంది. కాగా కానిస్టేబుల్ గౌరవ్ చౌధరికి గత ఏడాది డిసెంబర్‌లో వివాహమైంది. అయితే, వివాహానికి సెలవులు ఎక్కువగా మంజూరు కాకపోవడంతో కొద్ధి రోజులకే భార్యను ఇంటి దగ్గరే వదిలేసి తిరిగి విధుల్లోకి వెళ్లాడు. పెండ్లి తర్వాత అచ్చటా ముచ్చటా తీరకముందే భర్త తనను వదిలేసి డ్యూటీకి వెళ్లడంతో ఆ కానిస్టేబుల్ భార్య అలిగింది.భర్తపై కోపం పెంచుకుని అతడు ఫోన్ చేసినా ఎత్తడం మానేసింది. మరీ ఎక్కువసార్లు ఫోన్ చేస్తే ఆమె తన తల్లికి ఇచ్చి తాను మాట్లాడనని చెప్పిస్తోంది. దాంతో కానిస్టేబుల్ గౌరవ్ తన భార్య తనపై బాగా కోపంగా ఉందని గ్రహించాడు. ఎలాగైనా ఇంటికి వెళ్లి ఆమెను బుజ్జగించాలని నిర్ణయించుకున్నాడు.
అందుకోసం వెంటనే తన పైఅధికారి అయిన ఏఎస్పీకి లీవ్ లెటర్ రాశాడు. వివాహం జరిగిన కొన్ని రోజులకే భార్యను వదిలిపెట్టి విధులకు వచ్చానని, దాంతో ఆమె తనపై కోపంగా ఉన్నదని ఏఎస్పీకి రాసిన లీవ్ లెటర్‌లో కానిస్టేబుల్ గౌరవ్ తెలిపాడు. కోపంతో నాపై అలిగిన ఆమె ఫోన్ చేసినా ఎత్తడం లేదని, ఎత్తినా మాట్లాడటం లేదని తెలిపాడు. ఎన్నిసార్లు చేసినా ఫోన్ కట్ చేస్తున్నదని, ఒక్కోసారి ఆమె తల్లికి ఇచ్చి మాట్లాడనని చెప్పిస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. దయచేసి తనకు కొన్ని రోజులు సెలవు మంజూరు చేస్తే.. ఇంటికి వెళ్లి అలిగిన భార్యను బుజ్జగించుకుంటానని ఆ లేఖలో విజ్ఞప్తి చేశాడు. దాంతో కానిస్టేబుల్ బాధను సహృదయంతో అర్థం చేసుకున్న ఏఎస్పీ అతనికి 5 రోజులు సెలవు మంజూరు చేశాడు. దాంతో కానిస్టేబుల్ చాలా సంతోషంగా ఉన్నాడు. అయితే, లీవ్ కోసం కానిస్టేబుల్ రాసిన లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.