Tuesday, November 19, 2024

Big Story: నా తెలంగాణ‌, కోటి ఎక‌రాల మాగాణ.. సాగునీటి రంగంలో సరికొత్త అధ్యాయం!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఉమ్మడి పాలనలో తెలంగాణ సాగునీటిరంగం అంటే నానాటికి తరిగిపోతున్న ఆయకట్టు. కాని ప్రత్యేక తెలంగాణలో ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఆయకట్టు స్థిరీకరణ ప్రతి ఏటా గణనీయమైన స్థాయిలో పెరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం సాగునీటిపారుదల రంగానికి అగ్రస్థానం ఇవ్వటంతో ఎనిమిదేళ్ల వ్యవథిలో వ్యవసాయం, అనుబంధ రంగాల వృద్ధి ఉచ్ఛస్థితికి చేరుకుంది. తెలంగాణ కోటి ఎకరాల మాగాణగా సస్యశ్యామలం కావాలన్న సీఎం కేసీఆర్‌ చిరకాల వాంఛ నెరవేరేదిశగా సాగునీటిరంగం మైలురాయిని దాటింది. సాగునీటిరంగంపై రాష్ట్ర ప్రభుత్వం రూ.1,52,000కోట్లకుపైగా నిధులను వెచ్చించింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల నిర్మాణం రాష్ట్రసాగునీటిరంగంలో సరికొత్త అధ్యాయంగా నిలుస్తోంది. తెలంగాణ కోటి ఎకరాల మాగాణంగా మారుతోంది.

తెలంగాణ సాగునీటిప్రాజెక్టుల నిర్మాణానికి రూపకల్పనతోపాటు నిర్దేశించిన వ్యవథిలో ప్రాజెక్టులు పూర్తయ్యేలా ఎన్నో సమావేశాలు, వర్క్‌ షాపులను సీఎం కేసీఆర్‌ నిర్వహించారు. సుదీర్ఘయజ్ఞం అయిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా జరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. రాష్ట్ర వ్యవసాయరంగానికి సాగునీటి ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకున్న సీఎం కేసీఆర్‌… ప్రాజెక్టుల రీ డిజైనింగ్‌, రీ ఇంజనీరింగ్‌ వంటి వినూత్న ప్రణాళికలతో విజయవంతంగా ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తి చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ కృషి ఫలితంగా సాగునీటిప్రాజెక్టుల రూపురేకలు మారిపోయాయి. ఓవైపు కొత్త ప్రాజెక్టుల నిర్మాణంతోపాటు మరోవైపు పాత ప్రాజెక్టులను విప్లవాత్మకరీతిలో ఆధునీకరించడంతో సాగునీటి ఆయకట్టు పెరిగింది.

పెండింగ్‌ ప్రాజెక్టులన్నీ పూర్తి…
ఉమ్మడి పాలనలో దశాబ్దాలుగా నిర్మాణం పూర్తికాని పెండింగ్‌ ప్రాజెక్టులు… కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయల్‌సాగర్‌, ఎల్లంపల్లి, మిడ్‌ మానేరు, దేవాదుల తదితర ప్రాజెక్టులన్నీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక పూర్తయ్యాయి. ఫలితంగా నిత్యం కరువు తాండవించే పాలమూరు మాత్రంలో 16లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. డిండి, గట్టు ఎత్తిపోతల, చనాకా-కొరటా తదితర ప్రాజెక్టులు పూర్తికావొచ్చాయి. నాగార్జునసాగర్‌, నిజాంసాగర్‌, శ్రీరామ్‌సాగర్‌ వంటి పాత ప్రాజెక్టుల కాలువలను ఆధునీకరించింది.

త్వరలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నుంచి సాగునీరు…
నాగర్‌ కర్నూలు, మహబూబ్‌నగర్‌, మహబూబాబాద్‌, వికారాబాద్‌, నారాయణపేట్‌, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లోని కరువు ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు త్వరలో బీడు భూములకు సాగునీటిని అందించనుంది. నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్‌ మండలంలోని ఎల్లూరు వద్ద శ్రీశైలం రిజర్వాయర్‌ ముందు తీరం నుంచి అయిదు దశల్లో నీటిని ఎత్తిపోసేలా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును డిజైన్‌ చేశారు.

ఈ ప్రాజెక్టు నిర్మాణ అంచనా వ్యయం రూ.35200 కోట్లు కాగా… ఇప్పటికే 70శాతం పనులు పూర్తయ్యాయి. నిధుల కొరత రాకుండా ఉండేందుకు ఈ ఎత్తిపోతల పథకాన్ని కాళేశ్వరం కార్పోరేషన్‌తో రాష్ట్ర ప్రభుత్వం అనుసంధానం చేసింది. ఈ ప్రాజెక్టుతో నాగర్‌ కర్నూలు, మహబూబ్‌నగర్‌, మహబూబాబాద్‌, వికారాబాద్‌, నారాయణపేట్‌, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లోని 12.30లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. ఆయా జిల్లాల కరువు ప్రాంత ప్రజల చిరకాల స్వన్నం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు త్వరలో బీడు భూములకు సాగునీటిని అందించనుంది.

- Advertisement -

6.74లక్షల ఆయకట్టు లక్ష్యంతో సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు
గోదారి నీటిని ఎత్తిపోయడం ద్వారా భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాల్లోని 6.74లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. గోదావరి జలాలు సముద్రానికి కాకుండా తెలంగాణ పంట పొలాలకు… ప్రపంచంలోనే అతిపెద్ద సాగునీటి ఎత్తిపోతల పథకం కాళేశ్వరం. సముద్రంలోకి వృథాగా వెళ్లే గోదావరి నీటిని సద్వినియోగం చేసుకోవటంలో కాళేశ్వరం ద్వారా తెలంగాణ సఫలీకృతమైంది. తెలంగాణ రాష్ట్ర రైతుల కష్టాలను శాశ్వతంగా దూరం చేసేందుకు డిజైన్‌ చేసిన భారీ ప్రాజెక్టు ఇది. తెలంగాణలో సాగునీటికి నోచుకోని భూములను సస్యశ్యామలం చేసే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ బహులదశల ఎత్తిపోతల పథకాన్ని కాళేశ్వరం పేరుతో నిర్మించింది.

ఈ ప్రాజెక్టులో భాగమైన అన్నపూర్ణ, రంగనాయక్‌సాగర్‌, కొండపోచమ్మసాగర్‌ రిజర్వాయర్ల నిర్మాణం పూర్తయింది. ఈ అనుబంధ రిజర్వాయర్‌ ల నిర్మాణంతో ఆయా ప్రాంతాలకు సాగునీరు అందుతోంది. సాధారణంగా రిజర్వాయర్ల నిర్మాణం నదీ మార్గంలో జరుగుతుంది. కాని ఈ ఒరవడికి భిన్నంగా నది, వాగు ఏదీ లేనిచోట అతిపెద్ద రిజర్వాయర్‌ మల్లన్నసాగర్‌ను నిర్మించడం ద్వారా సాగునీటిరంగ చరిత్రలో రాష్ట్ర ప్రభుత్వం నూతన అధ్యాయాన్ని లిఖించింది. గోదావరి నీటిని 90 మీటర్ల నుంచి 618 మీటర్లకు ఎత్తిపోసే బృహత్తర కార్యాచరణ కాళేశ్వరం నిర్మాణంలో ప్రధానాంశం కావడం గమనార్హం.

మూడేళ్ల రికార్డు సమయంలోనే కాళేశ్వరం పూర్తి
కేవలం మూడు సంవత్సరాల వ్యవథిలోనే కాళేశ్వరం వంటి అతిభారీ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడం ద్వారా అసాధ్యాన్ని సుసాధ్యం చేయడంలో తనకుతానే సాటి అని తెలంగాణ ప్రభుత్వం నిరూపించుకుంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఇంజనీరింగ్‌ అద్భుతంగా పేరుగాంచింది. ఈ ప్రాజెక్టులో భాగంగా గోదావరి నదిపై మూడు బ్యారేజీలు, 20 మెగా నీటి లిఫ్ట్‌ లు, 21 పంపుహౌజ్‌లు, 180 రిజర్వాయర్లతోపాటు 1832 కి.మీ. పొడవునా సొరంగ మార్గాలు, పైపులైన్లు, కెనాళ్లను నిర్మించారు. మూడు సంవత్సరాల వ్యవథిలో అతి భారీ ప్రాజెక్టును పూర్తి చేసి తెలంగాణ ప్రభుత్వం ప్రపంచ రికార్డు నెలకొల్పిందంటే అతిశయోక్తి కాదు.

శ్రీరాంసాగర్‌ పునరుజ్జీవ పథకానికి కూడా కాళేశ్వరం జలాలను వినియోగిస్తున్నారు. ఇందుకోసం రివర్స్‌ పంపింగ్‌ అనే వినూత్న విధానానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కాళేశ్వరం నిర్మాణంతో గోదావరిలో నిరంతరం 100 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా చేసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు రైతులు చెల్లించాల్సి ఉన్న నీటితీరువా పన్ను బకాయిలను ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వం రద్దు చేసింది. శాశ్వతంగా నీటిపన్నును రద్దు చేసి రైతులకు ఉచితంగా సాగునీటిని అందిస్తోంది.

సిరులు కురిపించే సాగు భూములు: సీఎం కేసీఆర్‌
” కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 45లక్షల ఎకరాల భూమిలో రెండు పంటలు పండించేందుకు సాగునీరు అందుతుంది. దీంతో తెలంగాణలోని మిగిలిన ప్రాజెక్టులతో కలుపుకుంటే దాదాపు కోటి ఎకరాలకు నీరు అందుతుంది. ఫలితంగా సాగుభూములు సిరులు కురిపించే భూములుగా మారుతాయి.”

Advertisement

తాజా వార్తలు

Advertisement