తెలుగు అమ్మాయి, తెనాలి బ్యూటీ శోభిత ధూళిపాళ హిందీ సినిమాలతో తన ప్రయాణాన్ని షురూ చేసింది. ఆ తర్వాత తమిళ .. మలయాళ సినిమాలు చేస్తూ, టాలీవుడ్ వైపు వచ్చింది. అడివి శేష్ లీడ్ రోల్ చేసిన ‘గూఢచారి’ సినిమాలో శేష్‌తో రొమాన్స్ చేసింది ఈ అమ్మడు. అయితే ఎక్కడా తన పాత్రలో నుంచి బయటికి రాకుండా ఈ మూవీలో చాలా బాగా యాక్ట్ చేసిందనే మంచి టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు ‘మేజర్’ సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి వస్తోంది. అడివి శేష్ హీరోగా మహేశ్ బాబు నిర్మించిన ఈ సినిమాలో శోభిత కీలక పాత్ర పోషించింది.
శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను, జూన్ 3వ తేదీన భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శోభిత మాట్లాడుతూ “ఇది ప్రతి ఒక్కరూ చూడవలసిన సినిమా. ఇందులో నేను ప్రమోద అనే పాత్రను పోషించాను. 26/11న జరిగిన దాడిలో బందీగా కనిపిస్తాను. ధైర్యం.. నమ్మకం.. ఆశ.. నిరాశ.. భయం.. ఏడుపు.. ఇలా ఎన్నో భావోద్వేగాలు నా పాత్రలో కనిపిస్తాయి. ఇలాంటి ఒక డిఫరెంట్ రోల్‌ని చేసే చాన్స్ రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నా” అని చెప్పుకొచ్చింది ఈ సుందరి..