తన సోదరుడు ప్రిన్స్ విలియమ్ తనపై అటాక్ చేసినట్లు తెలిపారు ప్రిన్స్ హ్యారీ.. కాగా ప్రిన్స్ హ్యారీ రాసిన స్పేర్ ఆటోబయోగ్రఫీ జనవరి పదో తేదీన రిలీజ్ కానున్నది. తన భార్య మేఘన మెర్కల్ విషయంలో.. అన్న విలియమ్ తనపై భౌతికంగా దాడి చేశాడని, కాలర్ పట్టుకుని మరీ కొట్టాడని ప్రిన్స్ హ్యారీ తన ఆటోబయోగ్రఫీలో పేర్కొన్నాడు. ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం.. మేఘన గురించి అన్న విలియమ్ తప్పుడు వ్యాఖ్యలు చేశారని, ఆ సమయంలో తమ ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని, మీడియాకు కూడా మేఘన గురించి విలియమ్ అన్న తప్పుడు సమాచారం ఇచ్చారని ప్రిన్స్ హ్యారీ తెలిపారు.
ఓ దశలో విలియమ్ తన కాలర్ పట్టుకుని లాగేసినట్లు హ్యారీ చెప్పారు. తన మెడలో ఉన్న నక్లెస్ లాగేసి, తనను నేలపై పడేసి తన్నినట్లు తెలిపారు.అన్న అటాక్ చేయడం వల్ల తనకు వెన్ను నొప్పి వచ్చినట్లు హ్యారీ చెప్పారు. 2020లో బ్రిటన్ రాజకుటుంబం నుంచి హ్యారీ, మెర్కల్ జంట వేరుపడి ఉండేందుకు నిర్ణయించిన సమయంలో అన్నాదమ్ముళ్ల మధ్య గొడవ మొదలైంది. ఇంట్లో తగాదపడ్డ హ్యారీ జంట కాలిఫోర్నియాకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే గత ఏడాది క్వీన్ ఎలిజబెత్ 96 ఏళ్ల వయసులో మరణించారు. బ్రిటన్ చక్రవర్తిగా కింగ్ చార్లెస్ బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు ఈ ఏడాది మే నెలలో పట్టాభిషేక ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. ఇలాంటి సమయంలో హ్యారీ, విలియమ్ గొడవ బయటపడడం గమనార్హం.