Tuesday, November 26, 2024

Politics: గోవా కాంగ్రెస్​లో చిచ్చుపెట్టిన బీజేపీ.. 10మంది ఎమ్మెల్యేలను  చేర్చుకునేందుకు ప్లాన్​?

మొన్నటిదాకా మహారాష్ట్ర రాజకీయాల్లో సంక్షోభానికి కారణమైన బీజేపీ ఇప్పుడు గోవాలోనూ అట్లానే వ్యవహరిస్తోంది. కాంగ్రెస్​ పార్టీలో చిచ్చుపెట్టి ఆ చలిమంటలను ఎంజాయ్​ చేయాలని బీజేపీ చూస్తోందని కాంగ్రెస్ ​​ నేతలు మండిపడుతున్నారు. ఇప్పుడు గోవాలోని కాంగ్రెస్​ సీనియర్​ ఎమ్మెల్యే దిగంబర్​ కామత్​ నేతృత్వంలో కొంతమంది ఎమ్మెల్యే తిరుగుబాటు చేస్తున్నారు. వీరు బీజేపీలో చేరడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. అయితే.. దాదాపు ఆరు నుంచి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్​ను వీడేందుకు ప్లాన్​ వేసుకున్నట్టు తెలుస్తోంది.

దీనిపై గోవా కలంగుటే నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే మైఖేల్ లోబో మాట్లాడుతూ.. తాను బీజేపీలో చేరడం లేదని చెప్పారు. తమ ఎమ్మెల్యేలపై బీజేపీ గందరగోళం సృష్టిస్తోందని ఆయన ఆరోపించారు. ఇవ్వాల (ఆదివారం) గోవా  కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశం నిర్వహించగా కొంతమంది దానికి డుమ్మా కొట్టారు. దీంతో  మీటింగ్​కు రాని వారంతా పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారన్న వార్తలు గుప్పుమాన్నాయి. అయితే పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని, అవన్నీ ఉట్టి పుకార్లేనని కాంగ్రెస్ ఖండించింది.

40 మంది సభ్యులున్న గోవా అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 11 మంది ఎమ్మెల్యేలు, బీజేపీకి 20 మంది ఎమ్మెల్యేలు, ఎంజీపీకి ఇద్దరు, మరో ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలున్నారు. 2024 ఎన్నికలకు మార్గాన్ని సులభతరం చేసేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ తన గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement