Tuesday, November 26, 2024

దేశంలో నో లాక్‌డౌన్.. కానీ..

దేశంలో మరోసారి లాక్‌డౌన్ లేదని ప్రధానమంత్రి మోదీ స్పష్టం చేశారు. అయితే, కరోనాను లైట్ తీసుకోవద్దని రాష్ట్రాలకు సూచించారు. టెస్టులు చేయడంతో పాటు వ్యాక్సినేషన్‌లో వేగం పెంచాలని కోరారు. మాస్ వ్యాక్సినేషన్ కోసం ఏప్రిల్ 11 నుంచి 14 వరకూ వ్యాక్సినేషన్ ఉత్సవ్ నిర్వహించాలని తెలిపారు.

దేశవ్యాప్తంగా కరోనా రెండో వేవ్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో గురువారం(ఏప్రిల్ 8) రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వర్చువల్ గా సమీక్షా సమావేశం నిర్వహించారు. వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కొనసాగుతున్న తీరుపై ఆరా తీశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక సూచనలు చేశారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా కేసులు పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్రమోదీ.. దీన్ని అంతా కలిసికట్టుగా ఎదుర్కోవాలని సూచించారు. కరోనా కేసులకు సంబంధించి పంచ సూత్రాలు పాటించాలని కోరారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్‌మెంట్ చేయాలని కోరారు. వైరస్‌ కోసం వ్యాక్సిన్ కూడా విధిగా తీసుకోవాలని కోరారు. అలాగే వైరస్ సోకిన వ్యక్తి నుంచి 30 మంది వరకు సోకే అవకాశం ఉందని.. వారిని ట్రేస్ చేయాలని కోరారు.

కరోనా కట్టడికి రాత్రి పూట కర్ఫ్యూ విధించడం ఓ మంచి ప్రత్యామ్నాయమని ప్రధాని అభిప్రాయపడ్డారు. మైక్రో కంటైన్‌మెంట్‌ జోన్ల ఏర్పాటు, రాష్ట్రాల్లో రాత్రి 9 నుంచి తెల్లవారు వరకు నైట్ కర్ఫ్యూ పెడితే మంచిదన్నారు. దాన్ని రాత్రి కర్ఫ్యూకు బదులుగా కరోనా కర్ఫ్యూ అని పిలిస్తే బాగుంటుందని తెలిపారు. కరోనా కట్టడికి రాష్ట్రాలు కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ప్రధాని మోదీ సూచించారు.  రాష్ట్రాల్లో కరోనా నిర్ధారణ కోసం ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్యను భారీగా పెంచాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తు చేశారు. కరోనా బారిన పడిన వ్యక్తికి సంబంధించిన కాంటాక్ట్స్‌లో కనీసం 30 మందిని మూడు రోజుల్లోపు పరీక్షించాలని తెలిపారు. కొంతమంది కరోనాను లైట్ తీసుకుంటున్నారని.. కొన్ని రాష్ట్రాల్లో అధికార యంత్రాంగం సైతం ఈ అంశంపై సీరియస్‌గా ఫోకస్ చేయడం లేదన్నారు. మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్‌లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని మోదీ తెలిపారు. ఏప్రిల్ 11 నుంచి 14 వరకు ‘టీకా ఉత్సవ్’ నిర్వహిస్తామని తెలిపారు. దేశంలో 45 ఏళ్లు దాటిన వాళ్లందరికీ 100 శాతం టీకా అందించడమే లక్ష్యంగా పెట్టుకోవాలని చెప్పారు. కరోనా టెస్టుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని తెలిపారు. దేశంలో టీకా పొందే అర్హత ఉన్నవాళ్లందరికీ కరోనా టీకా అందేలా యువకులు కృషి చేయాలన్నారు. పాజిటివిటీ రేటును ఐదు శాతం దిగువకు తీసుకురావాలని, మరణాల శాతాన్ని తగ్గించాలని ప్రధాని మోదీ సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement