ఉపఎన్నికల విషయంలో పార్టీ ట్రబుల్ షూటర్ హరీష్ రావుకు కేసీఆర్ బాధత్యలు అప్పజెప్పుతుంటారు. ఒక్కోసారి మంత్రి కేటీఆర్‌ను కూడా పంపిస్తుంటారు. కానీ, ఈసారి వారితో పాటు సీఎం కేసీఆర్ కూడా స్వయంగా రంగంలోకి దిగడం, ఒక గ్రామానికి ఎన్నికల ఇన్చార్జిగా వస్తుండడంతో మునుగోడు రాజకీయాలు మరింత రసవత్తంగా మారనున్నాయి. ఇప్పటికే మంత్రి హరీష్ రావు మర్రిగూడ మండలం బాధ్యతలను తీసుకున్నారు. ఆ మండలంలోని చిన్న గ్రామమైన లెంకపల్లి సీఎం కేసీఆర్ ఎన్నికల ఇంచార్జిగా వ్యవహరించనున్నారు.
త్వరలోనే సీఎం కేసీఆర్ లెంకపల్లి గ్రామంలో పర్యటించనున్నట్టు సమాచారం. లెంకలపల్లి ఎంపీటీసీ పరిధిలో 2085 మంది ఓటర్లు ఉన్నారు. 15 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలా ఈ గ్రామం ఉంది. ఐతే స్థానిక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడంతో టీఆర్ఎస్ నాయకులు ఈ గ్రామంలో ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టారు. నెల రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీకి చెందిన గ్రామ సర్పంచ్ సతీశ్ 500 మందితో కలిసి సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎంపీటీసీ మాత్రం బీజేపీలో చేరారు.ప్రస్తుతం ఎంపీటీసీతోపాటు ఐదుగురు వార్డు సభ్యులు బీజేపీలో ఉన్నారు.ఇప్పుడు స్వయంగా కేసీఆర్ ఆ గ్రామ ఇంచార్జీగా బాధ్యతలు తీసుకోవడం ఆసక్తిగా మారింది.