తెలంగాణలో పురపోరుకు రంగం సిద్ధమైంది. పలు మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు జరుగనున్న ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. కరోనా నేపథ్యంలో నిబంధనలను అనుసరించి పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతోపాటు అచ్చంపేట, సిద్దిపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్ మున్సిపాలిటీలు, పలు పట్టణాల్లోని వార్డులకు శుక్రవారం ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 1,539 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ జరుగనుంది. ఇందులో 676 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. 9,809 మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటారు.
ఈ ఎన్నికల్లో మొత్తం 1,307 మంది అభ్యర్థులో పోటీలో ఉన్నారు. 11,34,032 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన 2,500 బ్యాలెట్ బాక్స్ లను సిద్ధం చేశారు. సిద్దిపేటకు 447, గ్రేటర్ వరంగల్ 1,021, ఖమ్మం 758, జడ్చర్ల 108, నకిరేకల్ 40, అచ్చంపేట 80, కొత్తూరు 24, నల్లగొండ 6, గజ్వేల్ 6, పరకాల 4, బోధన్ 6 బ్యాలెట్ బాక్స్ లు సిద్ధం చేశారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు 872 పోలింగ్ స్టేషన్లలో లైవ్ వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. ఎన్నికల సిబ్బందికి ఫేస్ మాస్కులు, ఫేస్ షీల్డులు, గ్లౌజ్‌లు, శానిటైజర్ బాటిళ్లు సిద్ధంగా ఉంచారు. ఎన్నికలు జరిగే అన్ని పోలింగ్ స్టేషన్ల వద్ద కొవిడ్ నిబంధనలు పక్కాగా అమలుచేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు ప్రతి పోలింగ్ కేంద్రంలో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
మరోవైపు మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడానికి వీల్లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా విజయోత్సవ ర్యాలీలను నిషేధించినట్టు తెలిపింది. గెలిచిన అభ్యర్థి ధ్రువీకరణ పత్రం తీసుకోవడానికి రిటర్నింగ్ అధికారి వద్దకు కేవలం ఇద్దరికే అనుమతించింది. నిబంధనలు అతిక్రమిస్తే తీవ్రంగా పరిగణించి విపత్తుల నిర్వహణ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఈసీ హెచ్చరించింది.