డ్రైనేజీ పనులు సరిగా చేయలేదని ఆరోపిస్తూ ఓ కాంట్రాక్టరుపై శివసేన ఎమ్మెల్యే దిలీప్‌లాండే వ్యవహరించిన తీరు వివాదాస్పదమవుతోంది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ముంబయి సహా పలు ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. చాలా చోట్ల రోడ్లపై మురుగునీరు ప్రవహిస్తోంది. ముంబయిలోని చాందివాలీ ప్రాంతంలో రోడ్లపై మురికి నీరు ప్రవహిస్తుండడంతో స్థానిక శివసేన ఎమ్మెల్యే దిలీప్ లాండే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైనేజీ కాల్వలకు చెత్త అడ్డంపడి నీరు ఎక్కడికక్కడే నిలిచిపోయినట్టు గుర్తించి, అందుకు డ్రైనేజీ పనుల క్రాంటాక్టరును తీసుకువచ్చారు. రోడ్డుపై ప్రవహిస్తున్న మురుగునీటిలో సదరు కాంట్రాక్టర్‌ను కూర్చోబెట్టి పారిశుద్ధ్య కార్మికులతో అతడిపై చెత్త వేయించారు. కాంట్రాక్టర్ పనులు సక్రమంగా చేయలేదని మండిపడ్డారు. రోడ్లపై మురికినీరు నిలవడానికి ఆ కాంట్రాక్టరే కారణమని, తన విధి నిర్వహణలో అతడు విఫలమయ్యాడని ఎమ్మెల్యే దిలీప్ లాండే ఆరోపించారు. ఈ ఘటనతో ఎమ్మెల్యే తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement