Thursday, November 21, 2024

మళ్లీ లాక్ డౌన్.. వలస కార్మికుల గతి ఏంటి?

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ముఖ్యంగా దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో కరోనా వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉంది. ప్రతిరోజు వేలల్లో కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా నియంత్రించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో నైట్ కర్ఫ్యూ, పాక్షిక లాక్ డౌన్ విధించింది. అయితే, కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ముంబైలో లాక్ డౌన్ విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  ప్రభుత్వం కూడా లాక్‌డౌన్‌ దిశగా ఆలోచిస్తోందన్న వార్తలు చాలామందిని కలవరపెడుతున్నాయి. వలస కూలీలు ఆందోళనకు గురవుతున్నారు.  ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ముంబైలో లక్షల్లో వలస కార్మికులు, కూలీలు బతుకీడుస్తున్నారు.

గతేడాది లాక్ డౌన్ కారణంగా వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉన్న ఉపాధి కోల్పోయి చేతిలో చిల్లి గవ్వ లేక పస్తులుండాల్సిన పరిస్ధితి వచ్చింది. అయితే, ఆ తర్వాత పరిస్థితులు కొంత అదుపులోకి రావడంతో గత ఆరు నెలలుగా వారికి ఏదో ఒక ఉపాధి దొరికింది. ఇప్పుడు మళ్లీ లాక్‌డౌన్‌ అంటుండటంతో వారు ఉన్న ఆధారం కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఒకవేళ మరోసారి లాక్‌డౌన్‌ విధిస్తే తమ కుటుంబ పరిస్ధితి ఏంటని తలచుకుంటూ వారు ఆందోళన చెందుతున్నారు. మళ్లీ లాక్ డౌన్‌ అమలు చేస్తే ముంబై మహానగరంలో ఎలా బతకాలో తెలియక చాలామంది కూలీలు, కార్మికులు మళ్లీ సొంతూళ్ల బాట పట్టారు. ఉపాధి కోసం నగరానికి రావాలనుకున్న వాళ్లు కూడా ప్రస్తుత పరిస్థితుల్లో తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు.

ఫిబ్రవరి చివరి వారం నుంచి కరోనా మళ్లీ విజృంభించడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. పలు ఆంక్షలు విధించింది. అయినప్పటికీ కరోనా వైరస్‌ నియంత్రణలోకి రాకపోవడంతో మరింత కఠినంగా వ్యవహరించింది. రాత్రి పూట కర్ఫ్యూ, 144 సెక్షన్‌ అమలు చేసింది. రాష్ట్రంలో రోజురోజుకు పెరిగిపోతున్న కరోనా కేసుల నేపథ్యంలో ప్రజల్లో మార్పు రావాలని, లేని పక్షంలో మరోసారి లాక్‌డౌన్‌ విధించక తప్పదని ప్రభుత్వం పదేపదే హెచ్చరిస్తోంది. దీంతో లాక్‌డౌన్‌ విధిస్తే ముంబైలోనే చిక్కుకుంటామని వారిలో భయంతో వలస కార్మికులు సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement