26/11 ముంబై ఉగ్రదాడి సమయంలో పాకిస్తానీ ఉగ్రవాది మహ్మద్ అజ్మల్ కసబ్‌ను సజీవంగా పట్టుకున్న వీర పోలీసు సిబ్బందికి పదోన్నతి లభించింది. అధికారిక వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. అప్పట్లో వారికి పతకాలు, అవార్డులు, నగదు బహుమతులు అందించారు. కానీ, ఇప్పటిదాకా వారికి ప్రమోషన్ ఇవ్వలేదు. కాబట్టి ఈ ఏడాది మార్చి 22 నాటి ప్రభుత్వ తీర్మానం (ఆర్డర్) ప్రకారం వారికి “ఒక దశ” ప్రమోషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. ఒక-దశ పదోన్నతి అంటే ఈ అధికారులు 2008 నుండి ప్రారంభమయ్యే కాలానికి, బకాయిలతో తదుపరి ఉన్నత ర్యాంక్ కోసం జీతాలు, ఇతర ప్రయోజనాలను పొందుతారు.
కసబ్‌ను పట్టుకునే ఆపరేషన్‌లో పాల్గొన్న ఒక అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. పోలీసులకు నగదు ప్రయోజనాలు రూ. 2 లక్షల నుండి రూ. 8 లక్షల వరకు ఉంటాయి. నవంబర్ 26, 2008న ప్రారంభమైన దాడిలో 170 మందికి పైగా చనిపోయారు. 300 మందికి పైగా గాయపడ్డారు. 26/11న ముంబైపై దాడి చేసిన 10 మంది పాకిస్తానీ ఉగ్రవాదులలో గిర్గామ్ చౌపటీ వద్ద సజీవంగా పట్టుబడ్డాడు కసబ్ ఒక్కడే. ఈ ఆపరేషన్‌లో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఏఎస్‌ఐ) తుకారాం ఓంబాలే చనిపోయాడు. కసబ్‌ను సజీవంగా పట్టుకున్న బృందంలో మొత్తం 15 మంది అధికారులు, – కానిస్టేబుళ్ల నుంచి ఇన్‌స్పెక్టర్ల వరకు ఉన్నారు. వారిలో 8 మంది ఇప్పటికే పదవీ విరమణ చేశారు.