ములుగు ప్రజలకు శుభవార్త. జిల్లా కేంద్రమైన ములుగు మున్సిపాలిటీగా ఆవిర్బవించనుంది. ములుగు, బండారుపల్లి, జీవంతరావుపల్లిని కలిపి ములుగును మున్సిపాలిటీగా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2024లో పంచాయతీల పదవీకాలం ముగియగానే ములుగు మున్సిపాలిటీగా మారనుంది. ఈ మేరకు సోమవారం శాసనసభలో ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టింది. నాలుగేళ్ల పదవి కాలం తర్వాతే అవిశ్వాస తీర్మానం పెట్టేలా మార్పుల కోసం పురపాలక సంఘం చట్ట సవరణ బిల్లును కూడా సభలో ప్రవేశపెట్టింది.
మేయర్, డిప్యూటీ మేయర్ పై అవిశ్వాసానికి, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లపై అవిశ్వాసానికి నాలుగేళ్ల తర్వాతే అవకాశం కల్పించాలని పేర్కొంది. జీహెచ్ఎంసీలో కో-ఆప్షన్ సభ్యుల సంఖ్య 5 నుంచి 15కు, ఇతర కార్పొరేషన్లలో కో-ఆప్షన్ సభ్యుల సంఖ్యను ఐదు నుంచి పదికి పెంపునకూ సభలో బిల్లు ప్రవేశపెట్టింది. దీంతో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో కో -ఆప్షన్ సభ్యుల సంఖ్య ఐదు నుంచి పదికి పెరగనుంది.