Thursday, November 21, 2024

వలసల సమయం: టీఎంసీలో చేరిన ముకుల్ రాయ్

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి తర్వాత రాజకీయాలు మారుతున్నాయి. మమత బెనర్జీ హ్యాట్రిక్ విజయం సాధించిన తర్వాత బీజేపీకి ఎదురు దెబ్బ తగిలింది. ఎన్నికల ముందు తృణముల్ కాంగ్రెస్ పార్టీని వీడిన నేతలంతా తిరిగి సొంత గూటికి చేరుతున్నారు. తాజాగా బెంగాల్ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన ముకుల్ రాయ్ సొంతగూటికి తిరిగొచ్చారు. తనయుడు సుభ్రాంశు రాయ్ తో కలిసి ఆయన ఇవాళ టీఎంసీలో చేరారు. పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సమక్షంలో పార్టీలో చేరారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయ జనాతాపార్టీలో ఎవ్వరూ ఉండరని ముకుల్ రాయ్ అన్నారు.

ఈ సందర్భంగా సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ, ముకుల్ రాయ్ పాత పార్టీనే మేలని అభిప్రాయంతో “ఓల్డ్ ఈజ్ గోల్డ్” అని భావించి పార్టీలో చేరారని వ్యాఖ్యానించారు. ముకుల్ రాయ్ ని పార్టీలోకి స్వాగతిస్తున్నామని, ఆయన పార్టీలో కీలకపాత్ర పోషిస్తారని తెలిపారు. ఎన్నికల ముందు డబ్బు కోసం, బీజేపీ కోసం పార్టీకి ద్రోహం తలపెట్టిన వారు, పార్టీపై విమర్శలు చేసినవారిని తాము పరిగణనలోకి తీసుకోవడంలేదన్నారు. పార్టీలో భారీ చేరికలు ఉంటాయని ఆమె చెప్పారు.

బీజేపీలో తాను ఇమడలేకపోయానని, మళ్లీ సొంత పార్టీలోకి రావడం చాలా సంతోషంగా ఉందని ముకుల్ రాయ్ అన్నారు. మమతా బెనర్జీతో తనకు ఎప్పుడూ విభేదాలు లేవని స్పష్టం చేశారు. తృణమూల్​ కాంగ్రెస్​ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన ముకుల్​ రాయ్​.. 2017లో పార్టీని వీడి బీజేపీలో చేరి ఆ పార్టీ జాతీయ ఉపాధ్య‌క్షునిగా సేవ‌లందించారు. ఇటీవల జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సమయంలో బీజేపీ తరుపున ముకుల్ రాయ్ విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే, బీజేపీ ఓటమి తర్వాత పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఈ క్రమంఓ తిరిగి సొంతగూటికి చేరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement