తెలుగు రాష్ట్రాల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైష్ణవ ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాల్లో ఉత్తర ద్వారం నుంచి భక్తులు దర్శనాలు చేసుకుంటున్నారు. కరోనా నేపథ్యంలో పలు ఆలయాల్లో ఆలయ అధికారులు ఆంక్షలను కూడా విధించారు. కోవిడ్ ఉధృతి దృష్ట్యా పలు ఆలయాల్లో వైకుంఠద్వార దర్శనాలు రద్దు చేసినట్లు ప్రకటించాయి.
సూర్యుడు ఉత్త రాయణానికి మరే ముందు మార్గశిర మాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ రోజున సాక్షాత్తు మహావిష్ణువు గారుడవహనంపై మూడు కోట్ల మంది (ముక్కోటి) దేవతలతో భూలోకానికి వేంచేసి భక్తులకు దర్శనం ఇస్తారు. అందుకే దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చినట్టు అష్టాదశ పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ రోజున వైష్ణవ ఆలయాల్లో వైకుంఠ వాకిళ్ళు తెరుచుకొని ఉంటాయి. అందుకే భక్తులు వైకుంఠ ద్వారం ద్వారా స్వామి వారిని దర్శించుకొని పాపవిముక్తులు అవుతారు. ఈసారి గురువారం (జనవరి 13) ఏకాదశి వచ్చింది. వేకువజామునే ఉత్తర ద్వారం గుండా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం సాంప్రదాయంగా వస్తోంది.
వైకుంఠ ఏకాదశి రోజున ప్రతిఒక్కరూ భక్తిశ్రద్ధలతో వైష్ణవ ఆలయాలు దర్శించుకుంటారు. ముఖ్యంగా మహా విష్ణువును ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటే ఆయన అనుగ్రహంతో పాటు శుభాలు కలుగుతాయి. ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల సమస్త పాపాలు తొలగి భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. అలాగే, ఈరోజు ఉపవాసం ఉండి ఎవరైతే మహా విష్ణువును ఆరాధిస్తారో.. ఉత్తరద్వార దర్శనం చేసుకొని విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారో వారికి దైవ అనుగ్రహం కలిగి మోక్షానికి మార్గం ఏర్పడుతుందని పురాణాలు చెబుతున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital