ముచ్చింతల్ మురిసింది. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఘట్టం అట్టహాసంగా జరిగింది. పండితుల వేదమంత్రోఛ్చరణల మధ్య వేడుకలు కన్నుల పండవగా సాగాయి. అందరూ సమానమనే సమాతా సూత్రాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానుభావుడు రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహంలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. 216ఫీట్ల రామానుజాచార్యుల విగ్రహాన్ని ప్రధాని నరేంద్రమోదీ వసంత పంచమి రోజు జాతికి అంఖితం చేశారు.
ప్రభన్యూస్‌బ్యూరో, ఉమ్మడిరంగారెడ్డి : పంచలోహాలతో రూపొందించి కూర్చున్న మూర్తుల్లో ప్రపంచంలోనే అతి పెద్ద రెండో విగ్రహంగా పేరు గాంచిన 216 ఫీట్ల సమాతా మూర్తి విగ్రహాన్ని ప్రధాని మోడీ ఇవ్వాల ఆవిష్కరించారు. ప్రధానమంత్రి చేతుల మీదుగా శ్రీరామాజాచార్యుల విగ్రహాన్ని కరతాల ధ్వనుల మధ్య ప్రారంభించి జాతికి అంఖితం చేశారు. శనివారం సాయంత్రం ఐదుగంటలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రత్యేక హెలికాప్టర్‌లో ముచ్చింతల్ చేరుకున్నారు. అరగంటపాటు విశ్రాంతి తీసుకున్న తరువాత బంగారు వర్ణం దుస్తులు ధరించి కార్యక్రమంలో పాల్గొన్నారు. దాదాపుగా నాలుగు గంటలపాటు విరామం లేకుండా దివ్య క్షేత్రంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అంతకుముందు పీఎంను చినజీయర్‌స్వామి, పారిశ్రామిక వేత్త రామేశ్వర్‌రావు స్వాగతం పలికారు. అక్కడినుండి పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
హోమంతోపాటు ప్రత్యేక పూజలు చేశారు ప్రధాని మోడీ. పూజా కార్యక్రమం సమయంలో చినజీయర్‌స్వామి ఎప్పటికప్పుడు పూజకు సంబంధించిన విశిష్టతను ప్రధానికి వివరించారు. దాంతోపాటు పీఎంకు కంకణధారణ చేశారు. దివ్యక్షేత్రంలో ఏర్పాటు చేసిన 108 దివ్యదేశాల దేవాలయాలను ప్రధాని సందర్శించారు. కార్యక్రమం మొదలు చివరి వరకు ప్రధానమంత్రి ఉత్సాహంగా కనిపించారు. కాగా, ఇక్కడ ఏర్పాటు చేసిన త్రీడీ లేజర్ షో ఎంతగానో ఆకట్టుకుంది. రంగరంగుల విద్యుత్తు దీపాలతో చూపరులను కట్టిపడేశాయి. లేజర్ షో మధ్యమధ్యలో చినజీయర్ స్వామి విశిష్టతను వివరిస్తూ ఇచ్చిన సందేశం స్ఫూర్తిగొలిపేలా ఉంది. సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ముగ్గురే ప్రసంగించారు. చినజీయర్‌స్వామి ప్రారంభ ఉపన్యాసం హిందీలో ఇచ్చారు. తరువాత కేంద్రమంత్రి గంగాపురం కిషన్‌రెడ్డి తెలుగులో ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ అరగంటకుపైగానే హిందీలో ప్రసంగించారు. ప్రధానమంత్రి ప్రసంగం ఆకట్టుకుంది. తెలంగాణ గొప్ప పర్యాటక కేంద్రంగా ఎదుగుతోందని పేర్కొన్నారు మోడీ. పర్యాటక తలమానికంగా సమతా కేంద్రం వెలుగొందుతుందని వెల్లడించారు. 108 దివ్యక్షేత్రాలను దర్శించుకున్నాను.. దేశమంతా తిరిగి దేవాలయాలను చూసిన అనుభూతి కలిగిందని మోదీ పేర్కొన్నారు. వేదపండితుల మంత్రోఛ్చరణల మధ్య మోదీకి ఘనంగా ఆశీర్వాదం ఇచ్చారు.
నాలుగు గంటలపాటు…
ముచ్చింతల్ దివ్యక్షేత్రంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ నాలుగు గంటలపాటు గడిపారు. సాయంత్రం ఐదు గంటలకు ముచ్చింతల్ చేసుకున్న ప్రధానమంత్రి అన్ని కార్యక్రమాలు ముగించుకుని రోడ్డుమార్గాన శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లి అక్కడినుండి ప్రత్యేక విమానంలో ఢిల్లికి వెళ్లారు. ముచ్చింతల్ దివ్యక్షేత్రంలో రూ. 1200కోట్ల వ్యయంతో సమతామూర్తి కేంద్రాన్ని 45ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. ఇందులో 216 అడుగుల రామానుజాచార్యుల విగ్రహం ఏర్పాటు చేశారు. పద్మపీఠంపై ఉన్న రామాజాచార్యుల విగ్రహం ఎత్తు 108 అడుగులు. వేదికపైకి వెళ్లేందుకు 108 ఉజ్జీవ సోపానాలు ఏర్పాటు చేశారు. మొదటి అంతస్తులో స్వామి స్వర్ణ విగ్రహం ఏర్పాటు చేశారు.
120ఏండ్లు రామానుజాచార్యులు జీవించారని అందుకు గుర్తుగా 120కిలోల స్వర్ణ విగ్రహం ఏర్పాటు చేశారు. దివ్య దేశాల పేరుతో 108 వైష్ణవ ఆలయాలను ఏర్పాటు చేశారు. సమతాపూర్తి కేంద్రానికి రెండువైపుల హంపీ రథాలను ఏర్పాటు చేశారు. రెండులక్షల మొక్కలతో సహస్రాబ్ది ప్రాంగణాన్ని అలంకరించారు. బెంగుళూరునుండి తెప్పించిన పుష్పాలతో కేంద్రాన్ని అందంగా అలంకరించారు.
ప్రభుత్వం తరపున స్వాగతం పలికిన మంత్రి తలసాని…
ముఖ్యమంత్రి కేసీఆర్ అనారోగ్యం నేపథ్యంలో కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ముచ్చింతల్‌లో జరిగే సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణకు సీఎం హాజరవుతారనే ప్రచారం జరిగింది. కానీ జ్వరం నేపథ్యంలో కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. దీంతో రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రభుత్వం తరపున ప్రధానికి స్వాగతం పలికారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్రమంత్రి గంగాపురం కిషన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్‌కుమార్, సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ ప్రధానమంత్రికి స్వాగతం పలికారు.
స్వాగతం పలికిన బీజేపీ నేతలు..
ప్రధానమంత్రి నరేంద్రమోదీకి బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, సీనియర్ నేతలు ఆముదాలపాడు జితేందర్‌రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, డీకే అరుణ, డాక్టర్ చంద్రశేఖర్, రఘునందన్‌రావు స్వాగతం పలికారు.బండి సంజయ్, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డిని పీఎం మోదీ భుజం తట్టి అభినందించారు.