ఏపీలో కరోనా విజృంభణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు 20 వేల కేసులు నమోదు అవుతున్నాయి. ప్రతి జిల్లాలో ప్రజలపై కరోనా పంజా విసురుతోంది. ఆస్పత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్, మందులు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. అయితే కరోనాతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు కొందరు మేమున్నామంటూ ముందకొస్తూ మానవత్వం చాటుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఓ తహశీల్దార్ అంబులెన్స్ డ్రైవర్‌గా మారారు. తహసీల్దార్ చేసిన పని అందరి మన్ననలు అందుకుంటోంది. ఆయన చేసిన పని ఎంతోమందికి స్ఫూర్తి నింపుతోంది. కరోనాతో ఇబ్బందిపడుతున్న పేషెంట్ ను ఆస్పత్రికి చేర్చారు.
సోంపేట ఎస్సీ వీధిలోని ఓ ఇంట్లో కరోనాతో వైద్యం పొందుతున్నారు. బుధవారం ఉన్నట్టుండి ఊపిరి అందకపోవడంతో కుటుంబసభ్యులు వెంటనే తహశీల్దార్‌కు సమాచారం ఇచ్చారు. ఎమ్మార్వోకు ఫోన్ వచ్చిన వెంటనే ఆయన.. దగ్గర్లో ఉన్న వాహనాల కోసం ప్రయత్నించారు. సమయానికి అత్యవసర వాహనాలు అందుబాటులో లేకపోవడంతో ఉద్దానం ఫౌండేషన్ అంబులెన్స్ వినియోగించేందుకు నిర్ణయించారు. డ్రైవర్ కుటుంబసభ్యుల పరిస్టితి బాగోలేకపోవడంతో విధులకు రాలేదు. ఏం చేయాలో అర్ధంకాని పరిస్థితి.
అంబులెన్స్ నడిపేందుకు ఎవరూ ముందుకురాకపోవడంతో తహసీల్దార్ గురుప్రసాద్ డ్రైవర్‌గా మారారు. ఆయనే స్వయంగా డ్రైవింగ్ చేస్తూ అంబులెన్స్ ని ఎస్సీ వీధికి తీసుకెళ్లి బాధితుడిని తీసుకొచ్చేందుకు వెళ్లారు. కొంతదూరం వెళ్లాక గమనించిన స్థానిక వాలంటీర్ శ్రీకాంత్ డ్రైవింగ్ చేసేందుకు ముందుకురావడంతో అతడికి పీపీఈ కిట్ సమకూర్చి బాధితుడిని సామాజిక ఆసుపత్రికి తరలించి వైద్యసేవలు అందించారు. కరోనా కష్టకాలంలో కరోనా బాధితుడిని ఆస్పత్రికి చేర్చేందుకు సహకరించిన వాలంటీర్ శ్రీకాంత్‌ను, తహశీల్దార్‌ను అధికారులతో పాటూ స్థానికులు అభినందించారు.