Thursday, November 21, 2024

Rajya Sabha: ఆ 12 మందికి పశ్చాత్తాపం లేదు: వెంకయ్య ఆగ్రహం

పార్ల‌మెంట్‌ సమావేశాల్లో భాగంగా నాలుగో రోజూ గంద‌ర‌గోళం నెల‌కొంది. లోక్‌స‌భ, రాజ్య‌స‌భ‌లో విప‌క్ష పార్టీల స‌భ్యులు ఆందోళ‌న‌కు దిగారు. ధాన్యాల కొనుగోలు విధానాన్ని ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ఎంపీలు రాజ్యసభలో చైర్మన్ పోడియాన్ని చుట్టుముట్టారు. రైతుల మ‌ర‌ణాలు, పెరుగుతున్న ద్ర‌వోల్భ‌ణంపై విప‌క్షా సభ్యులు నిర‌స‌న‌ తెలిపారు. పోడియం చుట్టూ ప్ల‌కార్డులు ప‌ట్టుకుని కేంద్ర స‌ర్కారు తీరుపై మండిప‌డుతూ నినాదాలు చేశారు. 12 మంది ఎంపీల స‌స్పెన్ష‌న్ తో పాటు ప‌లు స‌మ‌స్య‌ల‌పై రాజ్య‌స‌భ‌లో తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ వాకౌట్ చేసింది.

ఈ సందర్భంగా సభ్యుల తీరుపై చైర్మన్ వెంకయ్య నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత మూడు రోజులుగా సభ సజావుగా జరగలేదన్నారు. ప్రజాస్వామ్యం పునాదులుగా దేశ నిర్మాణం జరగాలని రాజ్యాంగం ఏర్పడిందని అన్నారు. ఈ క్రమంలో చట్టసభలకు, సభ్యులకు రాజ్యాంగం కీలక బాధ్యత అప్పగించిందన్నారు. 12 మంది సభ్యుల సస్పెన్షన్‌ను కొందరు సభ్యులు అప్రజాస్వామికం అంటున్నారని పేర్కొన్నారు. అందుకే సభను వేదికగా చేసుకుని నా ప్రతిస్పందన తెలియజేస్తున్నాను అని చెప్పారు. ఈ తరహా ప్రచారాన్ని ఎలా సమర్థించుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు.

చరిత్రలో సస్పెన్షన్ అనేది తొలిసారిగా జరగలేదన్న చైర్మన్ వెంకయ్య నాయుడు.. 1962 నుంచి 2010 వరకు 11 సార్లు సస్పెన్షన్లు జరిగాయని గుర్తు చేశారు. అవన్నీ కూడా అప్రజాస్వామికమేనా? అలా అయిన పక్షంలో ఇన్ని సార్లు ఎందుకు పునరావృతమయ్యాయి? అని ప్రశ్నించారు. సభా కార్యక్రమాలకు అడ్డుపడుతున్నప్పుడు రూల్ 255, 256 ప్రకారం సభ్యులను సస్పెండ్ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.

తాజాగా జరిగిన సస్పెన్షన్ వెనుక కారణమేంటో అందరికీ తెలుసు అని అన్నారు. 12 మంది సభ్యుల సస్పెన్షన్ కోసం తీర్మానం ప్రవేశపెట్టిన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అన్ని కారణాలు వివరించారని చెప్పారు. వర్షాకాల సమావేశాల్లో చోటుచేసుకున్న ఆ తరహా దుష్ప్రవర్తనను, ఘటనను తాను మళ్లీ గుర్తుచేయాలనుకోవడం లేదన్నారు. సస్పెన్షన్‌ను అప్రజాస్వామికం అంటున్నవారు ప్రజాస్వామ్య దేవాలయ పవిత్రతను ఆ సభ్యులు అవమానించిన తీరు గురించి మాట్లాడ్డం లేదని ఆగ్రహించారు. దీన్నిబట్టి పవిత్ర సభను అవమానించడం తప్పుకాదు, అలా చేసినందుకు చర్య తీసుకోవడమే అప్రజాస్వామికమనే సందేశాన్ని వారు పంపుతున్నారని చెప్పారు.

ప్రజాస్వామ్యానికి వీరు చెబుతున్న సరికొత్త నిర్వచనాన్ని దేశ ప్రజలు స్వీకరించరని నేను బలంగా నమ్ముతున్నాని తెలిపారు. గతంలోనూ సస్పెన్షన్లు జరిగాయని, తమ తప్పును గ్రహించిన సభ్యులు క్షమాపణ కోరిన సందర్భాల్లో మధ్యలోనే సస్పెన్షన్ రద్దు కూడా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయని చైర్మన్ గుర్తు చేశారు. కానీ ఈ 12 మంది సభ్యులు ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

- Advertisement -

‘ఇలాంటి సందర్భంలో ఏం చేయాలో చెప్పండి. మీరు చేసిన తప్పు గురించి పశ్చాత్తాపం లేదు, కానీ సస్పెన్షన్ ఎత్తేయాలని మాత్రం డిమాండ్ చేస్తారా? ఇదే ప్రజాస్వామ్య సూత్రమా? సభ్యులు విచారం వ్యక్తం చేస్తే సస్పెన్షన్ ఎత్తేయడాన్ని పరిగణిస్తామని అధికారపక్ష నేత చెప్పారు. డిప్యూటీ చైర్మన్ కూడా ఇరుపక్షాలు కూర్చుని మాట్లాడుకోవాలని సూచించారు. తప్పు చేయడం మానవ సహజం. అలాగే వాటిని సరిదిద్దుకోవడం కూడా మనిషి తత్వం. నేను చేసిన తప్పును సరిదిద్దుకోను అనడం ఏమాత్రం సమంజసం కాదు. గతంలో జరిగిన సస్పెన్షనైనా, ఇప్పడు జరిగిందైనా సభలో జరిగిన దుష్ప్రవర్తనను ఖండించడం కోసమే. సభలో జరిగిన అప్రజాస్వామిక చర్యలను నిరాకరించడం కోసమే సస్పెన్షన్. సభలో సభ్యులందరూ, ఇరుపక్షాలు కలిసి కూర్చుని తదుపరి ఏం చేయాలో నిర్ణయించాలి’ అని చైర్మన్ వెంకయ్య నాయుడు కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement