సిరిసిల్ల జిల్లా సుద్దాలకి చెందిన ప్రకృతి ప్రకాష్ కుమార్తె బ్లెస్సీ. తన పుట్టిన రోజు నాడు పర్యావరణ హిత కార్యక్రమం చేయాలని తలచింది. పచ్చదనాన్ని ప్రేమించే తండ్రినే స్ఫూర్తిగా తీసుకుని 65 వేల సీడ్ బాల్స్ స్వయంగా తయారుచేసింది. తాను తయారు చేసిన సీడ్ బాల్స్ కొన్ని సిరిసిల్ల అటవీ ప్రాంతంలో వెదజల్లింది. పర్యావరణంపై ప్రేమతో భావి తరాలకు స్ఫూర్తివంతంగా నిలుస్తున్న బ్లెస్సీని మంత్రి కేటీయార్, ఎంపీ సంతోష్ కుమార్ ట్విట్టర్ వేదికగా అభినందించారు. స్వయంగా హైదరాబాద్ రమ్మని ఆహ్వానించారు.
తన పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్ లో గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, ఎంపీ సంతోష్ కుమార్ తో కలిసి మొక్కలు నాటి అరుదైన గౌరవాన్ని అందుకుంది. అనంతరం తాను తయారుచేసిన సీడ్ బాల్స్ ని ఎంపీ సంతోష్ కుమార్ కి బ్లెస్సీ బహూకరించింది. ఈ కార్యక్రమం అనంతరం బ్లేస్సిని మంత్రి కేటీఆర్ వద్దకు స్వయంగా తీసుకెళ్లిన ఎంపీ సంతోష్ కుమార్. చిన్నతనం నుండే ప్రకృతి పట్ల ప్రేమను నింపిన బ్లెస్సీ తల్లిదండ్రులు ప్రకాష్,మమత ని కేటీయార్ ప్రత్యేకంగా అభినందించారు. ఏ అవసరమొచ్చినా అండగా ఉంటామని మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు.
సీఎం కేసీఆర్ మానస పుత్రికైన హరితహారం, గ్రీన్ఇండియా చాలెంజ్ స్పూర్తితో చేపట్టిన కార్యక్రమాలు భావితరాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. రాబోయే తరాలకు మంచి పర్యవరణాన్ని అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని గుర్తు చేశారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం పిల్లల్లో కూడా చైతన్యం నింపడం పట్ల ఎంపీ సంతోష్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. పిల్లల్లో ప్రకృతి పట్ల అవగాహన పెరగాలి, ప్రకృతి పట్ల ప్రేమను కనబరిచే చిన్నారులను ప్రోత్సహించాలి అని ఎంపీ సంతోష్ కుమార్ ఆకాంక్షించారు.
సీఎం కేసీఆర్ స్ఫూర్తితోనే తమ బిడ్డతో సీడ్ బాల్స్ తయారుచేయించామని బ్లెస్సీ తండ్రి ప్రకాష్ తెలిపారు. తమ కుమార్తె పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ ఆహ్వానించి గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనటం గొప్పవరంలా భావిస్తున్నామని ప్రకాష్ తెలిపారు.