జీహెచ్ఎంసీకి రాష్ట్ర ప్రభుత్వం పన్నులు చెల్లించడం లేదని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. తనకున్న సమాచారం మేరకు ప్రభుత్వం 2,600 కోట్ల రూపాయల పన్నులు కట్టాలన్నారు. ఆ పన్నులు రాబట్టితే జీహెచ్ఎంసీ అప్పులు చేయాల్సిన అవసరం ఉండదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం అభివృద్ధి పనులకు నిధులు ఇచ్చే విషయం దేవుడెరుగు.. కనీసం ప్రభుత్వ బంగ్లాల పన్నులు చెల్లించడంలేదని విమర్శించారు.
అన్ని రకాల పన్నులు పెంచారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన ప్రాపర్టీ ట్యాక్స్ కూడా కట్టట్లేదన్నారు. జీహెచ్ఎంసీలో అతిపెద్ద పన్ను ఎగవేతదారుడు కేసీఆర్.. రాష్ట్ర ప్రభుత్వమేనని ఆరోపించారు. ప్రగతి భవన్‌కు కూడా రూపాయి పన్ను కట్టలేదన్నారు. ప్రభుత్వం ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తోంది, జీహెచ్ఎంసీకి చెల్లించాల్సిన పన్నులు మాత్రం చెల్లించడం లేదని విమర్శించారు. రూ.800 కోట్లతో వరద నివారణ చర్యలు చేపడతామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదన్నారు. హైదరాబాద్ నగరంలోని నాలాలు, చెరువులు కబ్జాకు గురి కాకుండా సీసీ కెమెరాలు పెట్టాలన్నారు. త్వరలో మూసీ పరీవాహక ప్రాంతాల్లో పర్యటిస్తానని రేవంత్ రెడ్డి చెప్పారు.
ఇదీ చదవండి: ప్రధాని మోదీతో మాట్లాడనున్న వరంగల్ వాసి!