Friday, November 22, 2024

బేసిన్లు లేవు, భేషజాలు లేవన్నారు.. ఇప్పుడెందుకు ఈ పంచాయతీ?

కృష్ణాజ‌లాల వివాదంపై టీ.పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు.  ఈవిష‌యంలో ఏపీ, తెలంగాణ ముఖ్య‌మంత్రులు స్పందిస్తున్న‌ తీరును ఏకిప‌డేసారు. ఓట్ల కోసం కేసీఆర్ నీళ్ల‌ను ఏటీఎంలా వాడుకుంటున్నార‌ని మండిప‌డ్డారు.  కేసీఆర్ కావాలని లేని పంచాయతీని సృష్టిస్తున్నార‌ని ఆరోపించారు. రాజశేఖర్ రెడ్డిని తిట్టడం వల్ల సమస్య పరిష్కారం అవుతుందా అని ప్రశ్నించిన రేవంత్.. కోర్టులో కేసులు ఎందుకు వేయరు అని నిల‌దీశారు.

ఏపీ అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్ .. కృష్ణా జలాలను ఏవిధంగా తరలించేది స్పష్టంగా చెప్పిన త‌ర్వాత కూడా…  కేసీఆర్ ఆయ‌న్ను ప్ర‌గతి భవన్‌కు ఆహ్వానించి భోజనం పెట్టారని గుర్తు చేశారు. కేసీఆర్‌కు అన్ని విషయాలు చెప్పాకే.. ఏపీ ప్ర‌భుత్వం జీవో ఇచ్చింద‌ని తెలిపారు. ఏపీ నీటి దోపిడీపై సీఎం కేసీఆర్, గవర్నర్‌కు నాగం జనార్దన్ రెడ్డి లేఖ రాసినా స్పందించలేదని ఆరోపించారు. జల వివాదాల‌పై ప్రభుత్వం పోరాటం చేయాలి కానీ.. రాయలసీమ ఎత్తిపోతల మీద సామాన్య రైతు గవినోళ్ల శ్రీనివాస్ అనే వ్య‌క్తి పిటిషన్ వేశాడని గుర్తు చేశారు.  అయ‌న  వేసిన పిటిషన్‌పై అనుకూలంగా తీర్పు వచ్చాక.. ప్రభుత్వం ఇంప్లీడ్ అయ్యిందని చెప్పారు.

రాయలసీమ ఎత్తిపోతలకు ఏపీ 203 జీవో ఇచ్చినప్పుడు కూడా సీఎం కేసీఆర్ ఏమీ మాట్లాడలేదని తెలిపారు. ఎత్తిపోతల పథకానికి రూ.7 వేల కోట్లు కేటాయించినప్పుడూ ఏమీ మాట్లాడలేదని పేర్కొన్నారు. రాయలసీమ ఎత్తిపోతలపై పాలమూరు రైతు ఎన్జీటీకి వెళ్లి స్టే తెచ్చారని చెప్పారు. ఈ నెల 9న కేఆర్ఎంబీ సమావేశానికి ఎందుకు వెళ్లరని కేసీఆర్ ను రేవంత్ ప్రశ్నించారు. కృష్ణా జలాల పరిరక్షణ కంటే పెద్దపనులు కేసీఆర్ కు ఏమున్నాయని నిలదీశారు. గతంలో తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీశ్ రావు.. తెలంగాణకు 34 శాతం కృష్ణా నీళ్లు సరిపోతాయని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. గతంలో సీఎం కేసీఆర్ తిరుమల సందర్శనకు వెళ్లిన సమయంలో నగరి ఎమ్మెల్యే రోజా ఇంట్లో ఆతిథ్యం స్వీకరించి.. బేసిన్లు లేవు, భేషజాలు లేవు అని వ్యాఖ్యానించారని తెలిపారు.

ఇది కూడా చదవండి: రేవంత్ కేక‌తో.. కేసీఆర్‌లో కాక!

Advertisement

తాజా వార్తలు

Advertisement