Tuesday, November 26, 2024

హౌస్ అరెస్ట్ పై లోక్ సభ స్పీకర్ కు రేవంత్ ఫిర్యాదు

త‌న‌ను అక్ర‌మంగా హౌజ్ అరెస్ట్ చేసి పార్ల‌మెంట్ కు హ‌జ‌ర‌వ్వ‌కుండా తెలంగాణ పోలీసులు అడ్డుకున్నార‌ని టీ.పీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి లోక్ సభ స్పీక‌ర్ కు ఫిర్యాదు చేశారు. త‌ను పార్ల‌మెంట్ కు వెళ్లాల‌ని ఎంత చెప్పినా అధికారులు వినిపించుకోవ‌టంలో లేద‌ని, త‌న హ‌క్కుల‌కు భంగం క‌లిగించిన పోలీసులు, అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రేవంత్ రెడ్డి ఫిర్యాదులో కోరారు. మ‌ల్కాజ్ గిరి ఎంపీగా, తెలంగాణ కాంగ్రెస్ అధ్య‌క్షుడిగా త‌ను ప్ర‌భుత్వ అవినీతిపై పోరాడుతున్నాన‌ని… కోకాపేట‌లో వేలం వేసిన భూముల్లో అవినీతి జ‌రిగింద‌ని పార్ల‌మెంట్ లో ప్ర‌స్తావించాల‌నుకున్న త‌న‌ను ఢిల్లీ రాకుండా అడ్డుకున్నార‌ని రేవంత్ రెడ్డి ఆరోపించారు. పార్ల‌మెంట్ సమావేశాలు కొనసాగుతున్న వేళ.. తనను అరెస్ట్ చేసేందుకు ముందుగా మీ అనుమ‌తి తీసుకోవాల‌ని… కానీ అలా చేయ‌కుండా పోలీసులు చ‌ట్టాన్ని అతిక్ర‌మించార‌న్నారు. వెంట‌నే అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రేవంత్ రెడ్డి ప్రివిలేజ్ మోష‌న్ ఇచ్చారు.

కాగా, హైదరాబాద్ నగర శివారులోని కోకాపేట్ భూముల అమ్మకంలో వెయ్యి కోట్ల అవినీతి జరిగిందని టీ.పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వేలం వేసిన భూముల వద్ద ధర్నాకు పిలుపునిచ్చింది.ఈ నేపథ్యంలో ఆ భూములను సందర్శించాలని ఆపార్టీ నేతలు భావించారు. దీంతో ముందస్తుగా అప్రమత్తమైన పోలీసులు.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని గృహనిర్బంధం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement